Electricity Bill: కరెంట్ బిల్లు కాంగ్రెస్ కడుతుంది.. మేము కట్టం.. షాక్ ఇస్తున్న కర్ణాటక ప్రజలు..!
* ఎన్నికల సందర్భంగా ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని కాంగ్రెస్ వాగ్థానం చేసింది. దీనికి గృహ యోజన పేరు పెట్టింది. కాంగ్రెస్ ఎన్నికల్లో గెలవడంతో ఆ పార్టీయే విద్యుత్ బిల్లులు చెల్లిస్తుందని గ్రామస్తులు తెగేసి చెప్పేశారు.
Electricity Bill: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించింది. 224 స్థానాలకు గాను హస్తం పార్టీ 135 స్థానాలో జయకేతనం ఎగురవేసింది. భారీ విజయం దక్కడంతో డీకే. శివకుమార్ నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులు కర్ణాటకలో సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఇదే తరుణంలో ఆ పార్టీకి కర్ణాటక గ్రామస్తులు కరెంట్ బిల్లు రూపంలో షాక్ ఇచ్చారు.
పూర్తి వివరాల్లోకి వెళితే..సిద్ధాపూర్ గ్రామ పంచాయతీకి చెందిన గ్రామ విద్యుత్ ఉద్యోగి కరెంట్ బిల్లుల కోసం జల్లికట్టే గ్రామానికి వెళ్లాడు. కరెంట్ బిల్లు కట్టాల్సిందిగా గ్రామస్తులను కోరాడు. అయితే వారు ఎదురుతిరిగారు. కరంట్ బిల్లులు కట్టమని తెగేసి చెప్పారు. విషయం ఏంటంటే, ఎన్నికల సందర్భంగా ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని కాంగ్రెస్ వాగ్థానం చేసింది. దీనికి గృహ యోజన పేరు పెట్టింది. కాంగ్రెస్ ఎన్నికల్లో గెలవడంతో ఆ పార్టీయే విద్యుత్ బిల్లులు చెల్లిస్తుందని గ్రామస్తులు తెగేసి చెప్పేశారు. ఆర్డర్ వచ్చేంత వరకు విద్యుత్ బిల్లులు కట్టాలని ఎలక్ట్రిసిటీ సిబ్బంది చెప్పినా...గ్రామస్తులు మాత్రం ససేమిరా అంటున్నారు.
విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు బిల్లులు కట్టాలని చెబుతున్నా..గ్రామస్తులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఎన్నికల సందర్భంగా ఉచిత విద్యుత్ హామీతో పాటు అన్నభాగ్య, యువనిధి అంటూ మరో రెండు కీలక హామీలను కాంగ్రెస్ ఇచ్చింది. అన్నభాగ్య పథకం కింద బీపీఎల్ ప్రజలకు ప్రతి నెలా 10 కిలోల బియ్యం ఉచితంగా అందిస్తామని చెప్పింది. అలాగే గ్రాడ్యుయేట్ యువతకు ఉద్యోగం రాకపోతే నెలకు రూ.3000, డిప్లొమో ఉన్న నిరుద్యోగులకు రూ.1500 ఇస్తామని ప్రకటించింది.