Uttarakhand: టన్నెల్‌లో చిక్కుకున్న 41 మంది కార్మికులు.. సహాయక చర్యలు చేపట్టిన NDRF, SDRF బృందాలు
Uttarakhand: టన్నెల్‌కు సమాంతరంగా డ్రిల్లింగ్ చేస్తున్న అధికారులు
Uttarakhand: ఉత్తరాఖండ్‌లోని టన్నెల్ ప్రమాద ఘటనలో రెస్క్యూ ఇంకా కొనసాగుతోంది. ఉత్తరకాశీ జిల్లాలోని 9 రోజుల క్రితం యమునోత్రి జాతీయ రహదారిపై రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతుండగా ప్రమాదం జరిగింది. రహదారి నిర్మాణాల్లో భాగంగా సిల్యారా- దండోల్గావ్వరకు సొరంగం నిర్మిస్తుండగా... టన్నెల్ ఒక్కసారిగా కూలిపోవడంతో కార్మికులు అందులో చిక్కుకుపోయారు. శిథిలాలు పూర్తిగా కప్పేయడంతో వారు బయటకు రావడానికి మార్గం మూసుకుపోయింది. NDRF, SDRF బృందాలు సంఘటనా స్థలంలో సహాయ కార్యక్రమాలు చేపట్టారు. టన్నెల్ స్టార్టింగ్ పాయింట్ నుంచి 200 మీటర్ల వరకూ కుప్పకూలినట్టు అధికారులు తెలిపారు. టన్నెల్‌కు సమాంతరంగా డ్రిల్లింగ్ చేసి సొరంగంలోకి పైపుల ద్వారా కార్మికులకు ఆక్సిజన్‌ను అందిస్తున్నారు. కార్మికులను క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు శిథిలాలను తొలగిస్తున్నారు.
సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులు ఇంకా బయటకురాలేదు. సొరంగంలో చిక్కుకున్న కార్మికులను బయటకు రావడానికి వీలుగా అధికారులు ఎస్కేప్ మార్గాన్ని సిద్ధం చేయడానికి చేపట్టిన డ్రిల్లింగ్ పనులను అధికారులు నిలిపివేశారు. డ్రిల్లింగ్ యంత్రానికి పెద్ద పెద్ద బండరాళ్లు ఎదురవుతుండటంతో డ్రిల్లింగ్ పనులను నిలిపివేశారు. సహాయక చర్యలను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పరిశీలించారు. బాధితులను క్షేమంగా బయటకు తీసుకురావడానికి భారీ డయామీటర్ స్టీల్ పైపులైన్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. సొరంగం శిథిలాల గుండా ఈ పైపులైన్‌ను పంపించనున్నట్లు వెల్లడించారు.
సొరంగంలో కార్మికులు ఉన్న చోటుకి చేరుకోవడానికి నిట్టనిలువుగా కంటే అడ్డంగా మార్గాన్ని తవ్వడమే సరైందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎలాంటి అడ్డంకులు ఎదురు కాకుంటే రెండున్నర రోజుల్లో కార్మికులు ఉన్న చోటుకి చేరుకోవచ్చని అన్నారు. సొరంగంలో కార్మికులు స్వేచ్ఛగా అటూ ఇటూ తిరుగుతున్నారని, వారికి ఆహారం, నీరు, విద్యుత్, ఆక్సిజన్ అందుతున్నాయని, ప్రాణాపాయం లేదని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. అమెరికా యంత్రంతో అతిత్వరలో తిరిగి డ్రిల్లింగ్ ప్రారంభిస్తామని అధికారులు చెప్తున్నారు. సొరంగంలో ఉన్న కార్మికులకు మల్టీ విటమిన్ మాత్రలు, ఎండు ఫలాలు తదితరాలు అందిస్తున్నామని అన్నారు.