ఇది ప్రకృతి అకస్మాత్తుగా విరుచుకుపడితే ఏమవుతుందో మరోసారి రుజువు చేసిన ఘటన. ఉత్తరాఖండ్ లో మంచు చరియలు విరిగిపడి.. ఒక డ్యాం కొట్టుకుపోయింది. దాంతో వచ్చిన వరదలతో ఒక ఊరు నామరూపాల్లేకుండా పోయింది. అదేవిధంగా అక్కడ ఉన్న హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ పూర్తిగా ధ్వంసం యింది.
నిన్న (ఆదివారం) ఉత్తరాఖండ్ లో విరుచుకుపడిన మంచుచరియలు చేసిన విధ్వంసాన్ని పరిశీలించడానికి వెళ్ళిన బృందాలు ఆ విషాద నష్టాన్ని అంచనా వేస్తున్నాయి. భారత వాయుసేన ఏరియల్ సర్వేలో జలాశయం, డ్యాం అసలు కనిపించలేదు. అదేవిధంగా అక్కడి దాదాపు రూ. 3 వేల కోట్ల రూపాయల విలువైన 520 మెగావాట్ల తపోవన్ విష్ణుగద్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ప్రాజెక్టు పూర్తిగా ధ్వంసమైంది.
భారత వాయుసేన విమానాల్లో సర్వేకు వెళ్ళిన అధికారులు డెహ్రాడూన్ కు 280 కిలోమీటర్ల దూరంలోని దౌలీ గంగా, రిషి గంగా నదులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు ప్రమాద నష్టాన్ని అంచనా వేశారు. జోషిమర్-తపోవన్ మధ్య ఉన్న రహదారి నాశనం అయినట్టు వారు తెలిపారు. అదేవిధంగా తపోవన్ జలాశయం వద్ద మలరీ లోయకు వెళ్లేందుకు నిర్మించిన రెండు బ్రిడ్జిలు కూడా అదృశ్యం అయిపోయినట్టు చెప్పారు. ఇక ఆ ప్రాంతంలో లోయలో ఉన్న జనావాస నిర్మాణాలు కోద్ద ధ్వంసం అయినట్టు ఆ అధికారులు పేర్కొన్నారు.
ఈ ప్రమాదానికి కారణం నందాదేవి పర్వతంపై ఉన్న కొండ చరియలు విరిగి పడటమే అని వారు తేల్చారు. ఈ చరియలు పిపిల్ కోటి, చమోలీ నుంచి కిందకు జారి ధౌలీ గంగా, అలకనంద నదులపై పడ్డాయని వాయుసేన వర్గాలు వెల్లడించాయి.
ఇక ఇక్కడ నివాసం ఉంటున్న వారిలో చాలా మంది గల్లంతయ్యారు. వారి జాడ ఇప్పటివరకూ దొరకలేదు. కాగా, మంచు పర్వతాల నుంచి విరిగిపడిన చరియలతో డ్యాంలో ఒక పక్క పూర్తిగా ధ్వంసం అయిపోయిందని ఎన్టీపీసీ వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడి డ్యాం, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ లను ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీ నిర్వహిస్తోంది. వారు చెబుతున్న వివరాల ప్రకారం ఇక్కడ పనిచేస్తున్న 170 మంది గల్లంతు అయ్యారు. అంతేకాకుండా, రిషి గంగా తీరంలో ఉన్న రైనీ గ్రామం పూర్తిగా నాశనం అయిపొయింది.
ఇదిలా ఉండగా ఇప్పటివరకూ చమోలీ జిల్లాలోని వివిధ ప్రాంతాలలో 15 మందిని రక్షించారు. 14 మృతదేహాలను గుర్తించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చమోలీ పోలీసులు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.