బీజేపీ ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు నమోదు

కొద్దిరోజులుగా అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరాఖండ్‌ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్‌ నేగిపై ఎట్టకేలకు కేసు..

Update: 2020-09-07 09:53 GMT

కొద్దిరోజులుగా అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరాఖండ్‌ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్‌ నేగిపై ఎట్టకేలకు కేసు నమోదు అయింది. మహిళ ఫిర్యాదు మేరకు ద్వారహత్ నుండి గెలిచిన బిజెపి ఎమ్మెల్యే మహేష్ నేగిపై అత్యాచారం మరియు క్రిమినల్ బెదిరింపుల కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. నెహ్రూ కాలనీ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం మహేష్‌ నేగిపై ఐపిసి సెక్షన్ 376 (అత్యాచారం), 506 (క్రిమినల్‌ బెదిరింపు) కింద స్థానిక కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్టు డెహ్రాడూన్‌ పోలీసు సూపరింటెండెంట్‌ (సిటీ) శ్వేతా చౌబే తెలిపారు.

మహేశ్‌ నేగి భార్య రీటా నేగిపై కూడా క్రిమినల్ బెదిరింపుల కేసు నమోదు అయింది. అయితే ఈ ఆరోపణలు తన పరువు తీసే కుట్రలో భాగంగానే వచ్చాయని ఎమ్మెల్యే అన్నారు, కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఈ కుట్రలో భాగం అయ్యారని అన్నారు. ఆ మహిళ తన నుండి రూ. 5 కోట్లు డిమాండ్ చేసిందని.. ఆ డబ్బు ఇవ్వని కారణంగానే ఆమె ఇలా మాట్లాడుతోందని చెబుతున్నారు. ఏది ఏమైనా దర్యాప్తుకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని.. కేసును న్యాయపరంగానే ఎదుర్కొంటానని ఆయన స్పష్టం చేశారు. కాగా, మహేశ్‌ నేగి తనను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడని, ఆయన కారణంగా పాపకు జన్మనిచ్చానని ఓ మహిళ ఆగస్టు 16న పోలీసులకు ఫిర్యాదు చేసింది.. అవసరమనుకుంటే తన బిడ్డకు డీఎన్‌ఏ పరీక్ష చేసి నిజాన్ని బయటకు వెల్లడించాలని కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలు ఫిర్యాదుతో ప్రాధమికంగా ఆధారాలు సేకరించిన పోలీసులు.. ఎమ్మెల్యే దంపతులపై కేసులు నమోదు చేశారు. 

Tags:    

Similar News