US Elections 2024 Results: అమెరికా 47వ అధ్యక్షుడిగా రిపబ్లికన్ అభ్యర్థి డోనల్డ్ ట్రంప్ ఎన్నిక ఖరారైపోయింది. డెమాక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌పై ఆయన స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించారు. ఎలక్టోరల్ వోట్లలో 270 మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసిన ట్రంప్.. అమెరికాకు ఇది స్వర్ణయుగం అని వ్యాఖ్యానించారు. అయితే, ఆయన విజయాన్ని భారత్ ఎలా చూస్తోంది? ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టడం వల్ల భారత్‌కు నష్టమా.. లాభమా?
అమెరికా ఓటర్లు ట్రంప్ వైపే ఎందుకు నిలబడ్డారు?
ఎన్నికల ప్రచారంలో ట్రంప్, కమలా హారిస్ మధ్య పోటా పోటీ అన్నట్టుగా ప్రచారం సాగింది. ట్రంప్ కంటే కమలా హారిస్ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని తొలినాళ్లలో సర్వేలు వచ్చాయి. ఆ తర్వాత వచ్చిన ఫలితాలు ట్రంప్, హారిస్ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా సాగింది. ప్రచారంలో ట్రంప్ ఇచ్చిన హామీలు ఆయన విజయంలో కీలకభూమిక పోషించాయి.
అమెరికా ఆర్ధిక వ్యవస్థను గాడినపెడతారని ట్రంప్ ఇచ్చిన హామీలను ఓటర్లు నమ్మారు. పాపులర్ ఓట్లలో 51 శాతం ఆయనకు దక్కాయి. కమలా హారిస్ కు 47 శాతం ఓట్లు వచ్చాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం, వేతనాలు, అక్రమ చొరబాట్లు, వేతనాల వంటి అంశాలు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపాయి.
గాజా యుద్దం విషయంలో డెమోక్రాట్ల వైఖరిపై జార్జియాలో మెజారిటీగా ఉండే అరబ్బులు, ముస్లింలు అసంతృప్తితో ఉన్నారని ఎన్నికల ఫలితాలు వెల్లడించాయి. అక్రమ వలసల విషయాన్ని ట్రంప్ ప్రచార అస్త్రంగా వాడుకున్నారు. 1798 నాటి ఎలియన్ ఎనిమీస్ యాక్ట్ ను మళ్లీ తెరమీదికి తెస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. ఈ హామీ ఆ పార్టీకి కలిసి వచ్చింది. బైడెన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు ద్రవ్యోల్బణంతో ధరలు పెరిగాయి. ఇవన్నీ కూడా కమలా హారిస్ కంటే ట్రంపే బెటర్ అనే అభిప్రాయం ఓటర్లకు కలిగిందని ఫలితాలు వెల్లడిస్తున్నాయి.
భారత్ – అమెరికా వాణిజ్యం
వాణిజ్యపరంగా భారత్ కు అమెరికా చాలా కీలకం. అమెరికా నుంచి చేసుకుంటున్న దిగుమతుల కంటే అమెరికాకు చేస్తున్నఎగుమతులే ఎక్కువ. విదేశాల నుంచి దిగుమతులపై భారత్ ఎక్కువగా పన్నులు వేస్తోందని ట్రంప్ గతంలో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆరోపించారు. తాను గెలిస్తే ఈ పరిస్థితిని మారుస్తానని హామీ ఇచ్చారు. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో భారతదేశం అమెరికాకు 78.54 బిలియన్ డాలర్ల ఉత్పత్తులను ఎగుమతి చేసింది. అమెరికా నుంచి 50.24 బిలియన్ల డాలర్ల ఉత్పత్తులను ఇండియా దిగుమతి చేసుకుంది. దీంతో అమెరికాతో వాణిజ్యంలో భారత్ లాభదాయకంగా ఉందని స్పష్టమవుతోంది.
భారత ఎగుమతులపై ట్రంప్ భారీగా ట్యాక్స్ విధిస్తే భారతీయ ఉత్పత్తుల ధరను పెంచుతుంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అధిక సుంకాలు విధించే దేశాలపై అదనపు పన్నులు విధించనున్నారు. అదే జరిగితే అమెరికాలో భారతీయ ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉంది. దీంతో ఇక్కడ ఉత్పత్తి రంగంపై ప్రభావం పడుతుంది. భారతీయ వస్త్రాలు, నగలు, తోలు ఉత్పత్తులకు డిమాండ్ తగ్గవచ్చు. అమెరికాకు భారత్ నుంచి 16 బిలియన్ డాలర్ల వస్త్రాల ఎగుమతి అవుతాయి. అమెరికా మార్కెట్ లో డిమాండ్ తగ్గితే భారతీయ తయారీదారులు ఉత్పత్తిని తగ్గించాల్సి ఉంటుంది.
భారత ఐటీ పరిశ్రమపై ఏ మేరకు ప్రభావం ఉంటుంది?
వలసలపై కఠినంగా ఉంటానని ట్రంప్ ప్రకటించారు. గతంలో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో హెచ్1 బీ వీసాలపై ఆయన కఠినంగా వ్యవహరించారు. అది భారతీయ ఐటీ నిపుణులపై ప్రభావం చూపించిందనే విమర్శలు వచ్చాయి. ఈసారి కూడా అదే బాట పడతారా, మారతారా అన్నది చూడాల్సి ఉంది.
సైనిక సహకారం
వాణిజ్యపరంగా భారత్ కు అమెరికా ప్రధాన వ్యూహాత్మక భాగస్వామి. రెండు దేశాల మధ్య కీలకమైన రక్షణ ఒప్పందాలున్నాయి. ఫైటర్ జెట్ ఇంజన్లను దేశీయంగా తయారు చేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనాను ఎదుర్కొనేందుకు రెండు దేశాల మధ్య సహకారం తప్పనిసరి అనే విశ్లేషణలున్నాయి.
చైనాకు చెక్
భారత్ లో సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ కేంద్రం, ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ, అంతరిక్ష, 6 జీ మొబైల్ టెక్నాలజీపై భారత్, అమెరికాలు కలిసి పనిచేయాలని ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. టెక్నాలజీలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించేందుకు బైడెన్ సర్కార్ ప్రయత్నించింది. ఇదే విధానాలను ట్రంప్ కొనసాగిస్తే, అది పరోక్షంగా భారత్ కు మేలు చేస్తుంది.
తొలి టర్మ్ లో ట్రంప్ అమెరికాకు ప్రయోజనం కలిగే అంశాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఈ దఫా కూడా అదే కొనసాగిస్తే దాని ప్రభావం ఇండియాతో పాటు ఇతర దేశాలపై కూడా ఉండే అవకాశం ఉంది. అయితే రానున్న రోజుల్లో ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.