Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ హింసాకాండ.. కేంద్రమంత్రి రంజన్ సింగ్ ఇంటిపై పెట్రో బాంబులు
Manipur Violence: మంత్రి ఇంటి వద్ద భారీగా మోహరించిన భద్రతా సిబ్బంది
Manipur violence: ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో మళ్లీ హింసాకాండ చెలరేగింది. వెయ్యి మంది ఆందోళనకారులు మూకుమ్మడిగా కేంద్రమంత్రి రంజన్ సింగ్ ఇంటిపై దాడి చేశారు. ఘటన జరిగిన సమయంలో మంత్రి ఇంఫాల్‌లోని ఇంట్లో లేరని మణిపూర్ అధికారులు తెలిపారు. ఇంఫాల్‌లో కర్ఫ్యూ ఉన్నప్పటికీ ఆందోళనకారులు కొంగ్బాలోని మంత్రి ఇంటిపై దాడి చేశారు. మంత్రి ఇంటి వద్ద మోహరించిన భద్రతా సిబ్బంది ఆందోళనకారుల కంటే ఎక్కువగా ఉన్నారు. దీంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
సంఘటన జరిగిన సమయంలో మంత్రి నివాసంలో 9 మంది సెక్యూరిటీ ఎస్కార్ట్ సిబ్బంది, ఐదుగురు సెక్యూరిటీ గార్డులు, 8 మంది అదనపు గార్డులు ఉన్నారు. 12వందల మంది ఆందోళనకారులు ఉండవచ్చని ఎస్కార్ట్ కమాండర్ తెలిపారు. దాడి సమయంలో ఆందోళనకారులు నలువైపుల నుంచి పెట్రోల్ బాంబులు విసిరినట్లు మంత్రి ఇంటి వద్ద ఉన్న భద్రతా సిబ్బంది తెలిపారు. మంత్రి ఇంటిపై మూకుమ్మడి దాడి జరగడం ఇది రెండోసారి. మే నెలలో జరిగిన దాడిలో ఆందోళనకారుల గుంపును చెదరగొట్టడానికి భద్రతా సిబ్బంది గాలిలోకి కాల్పులు జరిపారు. తన ఇంటిపై దాడి జరిగిన సమయంలో తాను అధికారిక పనిపై కేరళ రాష్ట్రంలో ఉన్నట్లు మంత్రి రంజన్ సింగ్ చెప్పారు. తన ఇల్లు పెట్రోలు బాంబుల దాడిలో దెబ్బతిందని మంత్రి చెప్పారు. మణిపూర్ లో శాంతి స్థాపనకు అందరూ కలిసి రావాలని కేంద్రమంత్రి సింగ్ కోరారు.