West Bengal: నందిగ్రామ్‌లో టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీపై జరిగిన దాడి ఘటనపై వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దాడిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలంటూ ఒక అడ్వకేట్ పిల్ వేశారు. దీన్ని విచారణకు స్వీకరించడానికి చీఫ్ జడ్జి ఎస్ఏ బాబ్డే సారథ్యంలోని త్విసభ్య బెంచ్ నిరాకరించింది. పిటీషనర్ కోల్‌కతా హైకోర్టుకు వెళ్లవచ్చని పేర్కొంది. నందిగ్రామ్ ఘటనలో మమతా బెనర్జీ కాలికి గాయమైంది. ఈ దాడి వెనుక బీజేపీ ఉందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కేంద్ర ఎన్నికల సంఘం రెండోసారి నోటీసులను జారీ చేసింది. కేంద్ర భద్రతా బలగాలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమెకు నోటీసులిచ్చింది. శనివారం కల్లా ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఈసీ హుకూం జారీ చేసింది. ఎన్నికల బందోబస్తుకు వచ్చిన కేంద్ర బలగాల్లోని కొందరు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు మమత కామెంట్ చేశారు. హోంమంత్రి అమిత్‌షా ఆదేశాల మేరకే కేంద్ర బలగాలు పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపైనే ఈసీ స్పందించింది.
సీఆర్పీఎఫ్ జవాన్ల విషయంలో బెంగాల్ సీఎం మమత చేసిన విమర్శలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పదని తృణమూల్ ముందే గ్రహించిందన్నారాయన. అందుకే కేంద్ర బలగాలపై విరుచుకుపడుతున్నారని షా ఎద్దేవా చేశారు. అమిత్‌షా శుక్రవారం బెంగాల్‌లో పర్యటించిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. సీఆర్పీఎఫ్ బలగాలను ఘెరావ్ చేయాలని పిలుపునిచ్చిన నేతను గానీ, సీఎంను గానీ తాను ఇప్పటి వరకూ చూడలేదన్నారు అమిత్‌షా.