Yaas Storm Effect: మమతా బెనర్జీపై కేంద్రం ఆగ్రహం
Yaas Storm Effect: సీఎం మమతా బెనర్జీ ప్రధానికి అసహనం కలిగించారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Yaas Storm Effect: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధానికి అసహనం కలిగించారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం పశ్చిమ బెంగాల్ లో యాస్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. తుపాను ప్రభావంపై చర్చించేందుకు కలైకుంద ఎయిర్ బేస్ వద్ద మోదీ ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి మమతా బెనర్జీ హాజరు కాకపోవడం రాజకీయ దుమారం రేపుతోంది. అంతేకాకుండా ఈ సమావేశానికి మమతా బెనర్జీ రాకకోసం ప్రధాని, బెంగాల్ గవర్నర్ 30 నిమిషాల పాటు వేచి చూశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఉద్దేశ్యపూర్వకంగానే దీదీ ఈ సమావేశానికి గైర్హాజరు అయ్యారని బీజేపీ నేతలు ఆరోపిస్తూ దీదీ నియంతృత్వ స్వభావాన్ని కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు.
దేశ చరిత్రలో ఇంత నీచంగా ప్రవర్తించిన సీఎం మరొకరు లేరని కేంద్రం వర్గాలు మండిపడ్డాయి. ఈ ముఖ్యమంత్రికి ఇంగితజ్ఞానం లేదు, అహంకారి అంటూ విమర్శించాయి. అయితే, దీనిపై మమత వాదన మరోలా ఉంది. వాస్తవానికి ప్రధానిని తాము ధిఘా వద్ద కలుస్తామని సీఎం మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వానికి తెలిపారు. అయితే, ప్రధానిని కలైకుంద ఎయిర్ బేస్ వద్ద కలవాలని కేంద్ర ప్రభుత్వం మమతకు సూచించింది. దాంతో మమత అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. దీనిపై బెంగాల్ ప్రభుత్వ వర్గాలు స్పష్టత నిచ్చాయి. మమతా బెనర్జీకి అనేక కార్యక్రమాలు ఉండడంతో ఆమె ప్రధానితో భేటీకి కూడా కొంత సమయం కేటాయించారని, ముందు నిర్ణయించిన షెడ్యూల్ మేరకే అమె వచ్చారని, ఇక ప్రధానిని ఎందుకు వేచిచూసేలా చేస్తారంటూ ప్రశ్నించాయి.
కాగా, దీనిపై మరో వాదన కూడా తెరపైకి వచ్చింది. మమతకు బద్ధ విరోధి అయిన సువేందు అధికారి ప్రధాని పక్కనే ఉండడంతో మమత తీవ్ర అసంతృప్తికి గురయ్యారని ప్రచారం జరుగుతోంది. రాజ్యంగ విలువలను అగౌరవపరచడమేనని సువేందు అధికారి విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానితో కలసి పని చేయాల్సింది పోయి రాజకీయాలు చేయడం దీదీ పట్ల అసహ్యం కలిగేలా చేస్తోందని దుయ్యబట్టారు.