Union Cabinet Meeting: నేడు కేంద్ర కేబినెట్ కీలక భేటీ
*పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం
Union Cabinet Meeting: ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. 3 వ్యవసాయ చట్టాల రద్దు తీర్మానాన్ని కేబినెట్ ఆమోదించనుంది. పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనున్నారు. వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ చేసిన ప్రకటనకు అనుగుణంగా.. రద్దు తీర్మానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ప్రధాని అధ్యక్షతన జరిగే సమావేశంలో వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుని ఆమోదించి, పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు. మూడు చట్టాల రద్దుకు కలిపి ఒకే బిల్లును వ్యవసాయ మంత్రిత్వ శాఖ రూపొందించినట్లు తెలుస్తోంది.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందు కేంద్ర కేబినెట్ కీలక భేటీ కానుంది. సాగు చట్టాల రద్దు అంశంపైనే చర్చ జరుగనుంది. ఇటీవల మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు కేంద్ర కేబినెట్ వ్యవసాయ చట్టాల రద్దు తీర్మానాన్ని ఆమోదించనున్నారు. ఈనెల 29 నుంచి ప్రారంభం కానున్న సమావేశాల్లోనే సాగు చట్టాల రద్దు బిల్లును ప్రవేశపెట్టనున్నారు. దీంతో పాటు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టనున్న వివిధ బిల్లులపై చర్చించనుంది కేబినెట్.
మరోవైపు సాగు చట్టాలు రద్దైతేనే తాము ఇళ్లకు వెళ్తామని భీష్మించుకున్నారు రైతులు. ఢిల్లీ సరిహద్దుల్లో తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. కాగా పార్లమెంట్ సమావేశాల మొదటి రోజే సాగు చట్టాల రద్దు బిల్లును తీసుకురానున్నట్లు తెలుస్తోంది. రైతుల నిరసనలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే ముందుగా సాగు చట్టాలను రద్దు చేయాలని కేంద్రం భావిస్తోంది.