Union Budget 2021-22: ఆరు సూత్రాల ప్రణాళికలను పట్టాలెక్కిస్తూ బడ్జెట్‌..

Update: 2021-02-01 12:48 GMT

2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. మోడీ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్‌ మూడోసారి బడ్జెట్‌ పాఠం చదివి వినిపించారు. కాకపోతే ఈసారి బడ్జెట్‌ ప్రతులకు బదులు ట్యాబ్‌ ద్వారా చూస్తూ చదివారు. లోక్‌సభలో గంటా 50 నిమిషాల పాటు సాగిన నిర్మలమ్మ బడ్జెట్‌... ఆరోగ్య రంగానికి పెద్దపీట వేస్తూ సాగింది. లాక్‌డౌన్‌ విధించకుంటే చాలా నష్టపోయేవారమంటూ... .కరోనా కష్టకాలంలో కఠినమైన ప్రయాణం చేశామని, వాటి లాభనష్టాలను సుదీర్ఘంగా దేశానికి వివరించారామె.

కరోనా మహమ్మారి ముప్పేట దాడి చేస్తున్న ఈ సమయంలో కఠినమైన ప్రయాణం చేస్తున్నామంటూ సాగిన ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌... ఆరు సూత్రాల ప్రణాళికలను పట్టాలెక్కించారు. ఆర్థికమాంద్యానికి కళ్లెం వేసే చర్యలను సాహసోపేతంగా అమలు చేస్తున్నామని సభాసాక్షిగా ప్రకటిస్తూనే... ఆరోగ్య రంగానికి అత్యధిక ప్రాధాన్యం కల్పించారు. గ్రామీణ, వ్యవసాయరంగాలకు పెద్ద పీట వేశారు. ఆదాయపన్ను చెల్లింపులో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా అలాగే పదిలపరుస్తూ మధ్య, ఎగువతరగతి వర్గాలకు ఒకరకంగా నిరాశ కల్పించారు. కరోనా రక్కసి దాడిని తట్టుకునేలా బడ్జెట్‌ ఉంటుందని అంచనా వేసిన దేశ మధ్య, దిగువ మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు ఒకింత అసంతృప్తికి గురవ్వాల్సి వచ్చింది.

కేంద్ర బడ్జెట్‌ను మూడోసారి విజయవంతంగా ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్... ఆరోగ్యం, వ్యవసాయం, విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలకు ప్రాధామ్యాలను పెంచారు. చిత్తశుద్ధితో ప్రజలకు సేవ చేసేందుకు కట్టుబడి ఉన్నామని, ప్రజల ఆదాయాలను పెంచే దిశగా బడ్జెట్‌ను కఠినమైన సవాళ్ల మధ్య రూపకల్పన చేయాల్సి వచ్చిందంటూ చెప్పుకొచ్చారు. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని.. మహిళలు, మైనార్టీల సంక్షేమమే ధ్యేయమని ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ చెప్పారు. నూతన సాంకేతిక పద్దతులు అమలు చేస్తామని, మోడీ ఆర్థిక విధానాలకు విశ్వసనీయత పెరిగిందని తెలిపారు.

ఈసారి బడ్జెట్‌లో ఆరుసూత్రాల ప్రణాళికలను నిర్మలాసీతారామన్‌ పట్టాలెక్కించారు. వైద్యం, ఆరోగ్యంను ఒకటో పిల్లర్లుగా అభివర్ణిస్తూ... భౌతిక, ఆర్థిక మూలధనం, మౌలిక సదుపాయాల కల్పనను రెండో ప్రాధామ్యంగా వివరించారు. సమ్మిళిత అభివృద్ధిని మూడో అంశంగా ప్రస్తావిస్తూనే... మానవ వనరులు, నైపుణ్య అభివృద్ధికి నాలుగో పిల్లర్‌గా పెద్ద పీట వేశామన్నారు. విద్యారంగం, పరిశోధనల అంశాన్ని ఐదో ప్రాధామ్యంగా చెబుతూ.... ప్రభుత్వం గరిష్ట పాలన విషయాన్ని ప్రముఖంగా వివరించారు.

ప్రాధాన్యత రంగాలకు కేటాయింపులు భారీగానే చేసిన కేంద్రం... భారతదేశ ఆర్థిక ప్రగతి, పురోగతి రెట్టింపు అయ్యేలా చర్యలు తీసుకుంటుందని తెలిపింది. కొవిడ్‌ నేపథ్యంలో ఆరోగ్య రంగానికి భారీగా కేటాయింపులు వడ్డించింది. కరోనా వ్యాక్సినేషన్‌ కోసం రూ. 35వేల కోట్లు ఇస్తూనే... ఆత్మనిర్బర్‌ ఆరోగ్య పథకానికి రూ.2 లక్షల 23 వేల 846 కోట్ల నిధులను పంచింది. నివారణ, చికిత్స, సంపూర్ణ ఆరోగ్య విధానంలో ఈ పథకం రూపొందించామని వివరించింది. 9 బీఎస్‌ఎల్‌-3 స్థాయి ప్రయోగశాలలు, 15 అత్యవసర ఆరోగ్య కేంద్రాలు, దేశంలో కొత్తగా నాలుగు ప్రాంతీయ వైరల్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. ఇక పట్టణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి కోసం ప్రధాని జల్‌జీవన్‌ మిషన్‌ అర్బన్‌ కోసం 87వేల కోట్లు కేటాయించింది. స్వచ్ఛభారత్‌ మిషన్‌కు రూ.1లక్షా 41వేల 678 కోట్లు ఇచ్చింది. ఇలా వివిధ పథకాల కింద ఆరోగ్య రంగానికి కేటాయించిన నిధుల శాతం అక్షరాల 137 పర్సెంట్‌.

ఇక మిగిలిన వివిధ రంగాలకు కేటాయింపులు ఎలా ఉన్నాయో చూద్దాం. వ్యవసాయ రంగానికి రూ.1,72,750 కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ.40 వేల కోట్లువాయు కాలుష్యం నివారణకు రూ. 2.217 కోట్లు, జాతీయ రహదారుల కారిడార్ల అభివృద్ధికి రూ.1,18,101 కోట్లు, ప్రత్యేక రహదారుల అభివృద్ధికి రూ.5 వేల కోట్లు, బస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అభివృద్ధికి రూ.18 వేల కోట్లు, విద్యుత్‌ రంగానికి 3.05 లక్షల కోట్లు, భారతీయ రైల్వేలకు రూ.1.15 లక్షల కోట్లు, పీపీపీ ద్వారా రూ.2.200 కోట్లతో 7 కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలిపారు. ఇక- ఇండియన్‌ షిప్పింగ్‌ కంపెనీకి రూ.1624 కోట్లు, బీమారంగంలో ఎఫ్‌డీఐలను 49 నుంచి 74శాతానికి పెంచారు. 2021-22లోనే పవన్‌‌హన్స్‌, ఎయిరిండియా ప్రైవేటీకరిస్తామని చెబుతూనే స్టార్టప్‌లకు 128 రోజుల్లోనే అనుమతి ఇచ్చే ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపారు.

అటు- రైతుల రుణాల లక్ష్యం రూ.16.5 లక్షల కోట్లుగా వడ్డించిన నిర్మలమ్మ... సౌరశక్తి రంగానికి రూ. వెయ్యి కోట్లు కేటాయించారు.32 రాష్ట్రాల్లో వన్‌ నేషన్‌-వన్‌ రేషన్‌‌ను అమలు చేస్తామని స్పష్టం చేశారు. కొత్తగా 100 సైనిక్‌ స్కూళ్లకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. లేహ్‌లో కొత్తగా సెంట్రల్‌ యూనివర్సిటీని, గిరిజన ప్రాంతాల్లో రెసిడెన్షియల్‌ స్కూళ్లను మంజూరు చేస్తూ... గోవా డైమండ్‌ జూబ్లీ ఉత్సవాలకు రూ.300 కోట్లు కేటాయించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు రూ. 3 వేల కోట్లు ఇచ్చారు. తమిళనాడులో రోడ్ల అభివృద్ధికి రూ. లక్ష కోట్లు, బెంగళూరు మెట్రో అభివృద్ధికి రూ.14,788 కోట్లు, కేరళలో రూ.65 వేల కోట్లతో అభివృద్ధి పనులు, చెన్నై మెట్రోకు రూ.63వేల కోట్లు, అసోంలో రూ.19 వేల కోట్లతో అభివృద్ధి పనులు నిర్వహిస్తామని చెబుతూ.. .మంచి ఆర్థిక వ్యవస్థ కోసం బ్యాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటుకు ఓకే చెప్పారు. వరికి కనీస మద్దతు ధర రెట్టింపు చేస్తామని ప్రకటించారు. 75 ఏళ్లు దాటిన సీనియర్‌ సిటిజన్లకు ఊరట ఇస్తూ... వారికి ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్‌ దాఖలు నుంచి మినహాయింపునిచ్చారు. ఆదాయ పన్ను స్లాబులో మార్పులు చేయకుండ కిందటేడాది పద్ధతినే కొనసాగించారు.

Tags:    

Similar News