Suella Braverman: భారత్‌పై ఇటీవల విద్వేశాన్ని వెల్లగక్కి.. స్వరం మార్చిన బ్రిటన్‌ హోంమంత్రి బ్రేవర్మన్‌

Suella Braverman: భారత్‌తో వాణిజ్య ఒప్పందం చేసుకునేందుకు బ్రిటన్‌ ఆతృతతో ఉందని వెల్లడించిన సుయేలా

Update: 2022-10-19 11:53 GMT

Suella Braverman: భారత్‌పై ఇటీవల విద్వేశాన్ని వెల్లగక్కి.. స్వరం మార్చిన బ్రిటన్‌ హోంమంత్రి బ్రేవర్మన్‌

Suella Braverman: భారత్‌పై ఇటీవల విద్వేశాన్ని వెల్లగక్కిన బ్రిటన్‌ హోంశాఖ మంత్రి సుయేలా బ్రేవర్‌ మాట మార్చారు. గతంలో చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చేందుకు యత్నించారు. తాజాగా యూకేలోని స్టాన్‌చాట్‌లో ఇండియా గ్లోబల్‌ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన దీపావళి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాను హోం మంత్రిగా రెండు దేశాల మధ్య భద్రతా పరమైన సహకారానికి విలువ ఇస్తానని తెలిపారు. ఇరు దేశాల్లో దేశీయంగా ఇది కీలకమైన అంశం. అంతేకాదు అంతర్జాతీయంగా ఇండో-పసిఫిక్‌లో చాలా ముఖ్యమైందని వెల్లడించారు. తాను బ్రిటీష్‌ ఇండియన్‌ అయినందుకు గర్వపడుతున్నానని చెప్పారు. భారతీయ సంతతి వారు బ్రిటన్‌కు చేసిన కృషిని కొనియాడారు. బ్రిటన్‌ గ్రామాలు, పట్టణాలు, నగరాలు భారతీయుల వలసలతో సుసంపన్నమయ్యాయని పొగడ్తలతో ముంచెత్తారు. ఆర్థికంగా ఇరుదేశాలు కలిసి పనిచేయాల్సిన అవశ్యకత ఉండటంతో వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి ఆతృతతో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. దీపావళి కార్యక్రమంలో బ్రేవర్మన్‌ పూర్తిగా సంప్రదాయ దుస్తుల్లో హాజరయ్యారు. భారత్‌ నా హృదయంలో ఉంది. నా ఆత్మలో ఉందన్నారు. నా తండ్రి మూలాలు అక్కడే ఉన్న గోవాలో, తల్లి మూలాలు మద్రాస్‌లో ఉన్నాయని స్పష్టం చేశారు.

బ్రిటన్‌ ప్రధానమంత్రిగా ఎన్నికైన లిజ్‌ ట్రస్‌ మంత్రివర్గంలో హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టారు సుయేలా బ్రేవర్మన్‌. ఇటీవల సుయేయేలా భారత్‌ను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకుంటే బ్రిటన్‌కు వలసలు భారీగా పెరుగుతాయంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. వీసా కాలపరిమితి ముగిసినా చాలా మంది భారతీయులు ఇంకా బ్రిటన్‌లోనే ఉండిపోయారంటూ ఆరోపించారు. వీసా కాలపరిమితి ముగిసినా బ్రిటన్‌లో ఉంటున్నవారిలో భారతీయులే అత్యధికులంటూ నోరుపారేసుకున్నారు. అంతేకాదు భారత్‌తో ఓపెన్‌ బార్డర్‌ మైగ్రేషన్‌ పాలసీతో బ్రిటన్‌కు నష్టమేనంటూ తన అక్కసును వెల్లగక్కారు. భారత్‌తో చేసుకున్న ఒప్పందాలతో యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు ఎలాంటి ప్రయోజనం లేదంటూ విమర్శలు గుప్పించారు. బ్రిగ్జిట్‌ కోసం బ్రిటన్‌ ప్రజలు ఓటేసింది. భారత్‌ వలసలు ప్రోత్సహించడానికా? అన్నట్టుగా వ్యాఖ్యలు చేశారు. దీంతో బ్రిటన్‌, భారత్‌ దేశాల మధ్య చిచ్చు మొదలయ్యింది.

సుయేలా బ్రేవర్మన్‌ తల్లిదండ్రులు భారతీయులే. గోవాకు చెందిన క్రిస్టీ ఫెర్నాండో కెన్యాకు వలస వెళ్లారు. కెన్యా నుంచి క్రిస్టీ 1960లో యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఆమె తల్లి ఉమా తమిళనాడు నుంచి మారిషస్‌కు అక్కడి నుంచి యూకేకు వలస వెళ్లారు. బ్రిటన్‌ నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌లో నర్సుగా పని చేశారు. క్రిస్టీ, ఉమా పెళ్లి చేసుకున్నారు. వారికి 1980లో సుయేలా జన్మించారు. కేంబ్రిడ్జిలోని హీత్‌ఫీల్డ్‌ స్కూల్‌లో న్యాయవాద పట్టా పొందిన సుయేల్లా 2015లో ఫారెహామ్‌ నుంచి తొలిసారి కన్జర్వేటివ్‌ పార్టీ తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు. ఆమె ఇంగ్లాండ్‌, వేల్స్‌కు అటార్నీ జనరల్‌గా, విద్యా ఎంపిక కమిటీ సభ్యురాలిగా కూడా పని చేశారు. నిజానికి బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా చేయాలంటూ డిమాండ్‌ చేసిన వారిలో సుయేల్లా బ్రేవర్మన్‌ కూడా ఉన్నారు. కానీ బోరిస్‌కు అనుకూలంగా ఉన్న లిజ్‌ ట్రస్‌ ప్రభుత్వంలో అనూహ్యంగా ఆమెకు హోంశాఖ దక్కింది. గౌతమ బుద్ధుడి బోధనలంటే ఎంతో ఇష్టపడే సుయేల్లా బ్రిటిష్‌ రాచరికంపై విపరీతమైన భక్తిని ప్రదర్శిస్తారన్న పేరుంది. బ్రిటన్‌కు అక్రమంగా వలస వచ్చే వారిని ఆఫ్రికా దేశమైన రవాండాకు తరలించడం తన కల అంటూ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

బ్రిటన్‌ హోంమంత్రి సుయేల్లా బ్రేవర్మన్‌ వ్యాఖ్యలు దిగ్ర్బాంతి కలిగించాయని భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఒక బాధ్యతాయుతమైన హోం మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర నిరాశకు గురైనట్టు ఢిల్లీ వర్గాలు తెలిపాయి. బ్రేవర్మన్‌ వ్యాఖ్యలను బ్రిటన్‌లోని భారత హైకమిషన్‌ సీరియస్‌గా తీసుకుంది. భారత్‌ పర్యటన నిమిత్తం వీసాల కోసం దరఖాస్తు చేసుకునే బ్రిటన్‌ పౌరులు వీసా కేంద్రాలకు స్వయంగా హాజరు కావాలని తేల్చి చెప్పింది. ఏజెంట్లు వస్తే వీసాలు మంజూరు చేయమంటూ స్పష్టం చేసింది. బ్రేవర్మన్‌ వ్యాఖ్యలకు ప్రతిచర్యగా భావిస్తున్నారు. అయితే బ్రేవర్మన్‌ వ్యాఖ్యలపై బ్రిటన్‌ ప్రధాని లిజ్‌ ట్రస్‌ స్పందించారు. హోంమంత్రి చేసిన వ్యాఖ్యలు బ్రిటన్‌ అధికారిక విధానాలు కావంటూ దిద్దుబాటుకు యత్నించారు. దీపావళి నాటికి తాము స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. ఆ దేశ విదేశాంగ మంత్రి జేమ్స్‌ క్లేవర్లీ మాట్లాడుతూ భారత్‌తో బలమైన వ్యాపార సంబంధాలు కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. భారత వలసదారులపై బ్రేవర్మన్‌ కామెంట్లపై క్లేవర్లీ స్పందిస్తూ మేము భారత్‌తో ఇంకా బలమైన వ్యాపార భాగస్వామ్యం కోరుకుంటున్నామని పేర్కొన్నారు.

Tags:    

Similar News