Twitter:కేంద్రంతో ట్విటర్ వివాదంలో మరో మలుపు
Twitter: ట్విటర్ తాత్కాలిక గ్రీవెన్స్ అధికారి ధర్మేంద్ర చతుర్ రాజీనామా చేశారు.
Twitter: కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఐటీ చట్టం నిబంధనల విషయంలో కేంద్రం, ట్విటర్ మధ్య వివాదం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. తాజా ఈ వివాదం మరో మలుపు తిరిగింది. ట్విటర్ తాత్కాలిక గ్రీవెన్స్ అధికారి ధర్మేంద్ర చతుర్ రాజీనామా చేశారు. గ్రీవెన్స్ అధికారిగా నియమితుడైన ధర్మేంద్ర చతుర్.. నెల తిరక్క ముందే ఆ బాధ్యతల నుంచి వైదొలగడం గమనార్హం. అయితే, ఆయన రాజీనామాపై వ్యాఖ్యానించేందుకు ట్విటర్ నిరాకరించింది.
కొత్త ఐటీ నిబంధనలకు విరుద్ధంగా గ్రీవెన్స్ అధికారి పేరు, వివరాలను ట్విట్టర్ గోప్యంగా ఉంచింది. కొత్త ఐటీ మార్గదర్శకాల అమలులో కేంద్ర ప్రభుత్వంతో ట్విట్టర్ పలుమార్లు వివాదాలు కొనితెచ్చుకున్న విషయం విదితమే. కొత్త ఐటీ నిబంధనల ప్రకారం యూజర్ల సంఖ్య 50 లక్షలు దాటితే సోషల్ మీడియా సంస్థలు ఫిర్యాదుల పరిష్కారానికి ఓ అధికారిని నియమించి, ఆ వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది.
ట్విటర్ వంటి దిగ్గజ సంస్థలు గ్రీవెన్స్ అధికారితోపాటు ఓ నోడల్ అధికారి, స్థానిక ఫిర్యాదుల అధికారిని కూడా నియమించాల్సి ఉంటుంది. ఈ అధికారులంతా భారత్‌లో నివసించేవారై ఉండాలి. కేంద్రం ఇచ్చిన తుది నోటీసుపై స్పందించిన ట్విటర్ కొత్త ఐటీ నిబంధనలను అనుసరిస్తామని వెల్లడించింది. అధికారులను నియామిస్తామని చెప్పిన ట్విట్టర్.. తాత్కాలిక ఫిర్యాదుల అధికారిగా ధర్మేంద్ర చతుర్‌ను నియమించింది.
అయితే, ఆయన మూడు వారాల్లోనే తప్పుకున్నారు. దీంతో ట్విటర్‌లో ఫిర్యాదుల అధికారి అని ఉన్నచోట కంపెనీ పేరు, అమెరికా చిరునామాతో కూడిన ఈ-మెయిల్ ఐడీ కనిపిస్తున్నాయి. ట్విటర్‌కు ఇపుడు న్యాయపరమైన రక్షణ లేకుండా పోయిందని, వినియోగదారులు పోస్ట్ చేసే సమాచారం మొత్తానికి కంపెనీయే బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.