Heavy Rains: దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు
Heavy Rains: గురుగావ్, ఫరీదాబాద్ నగరాల్లో కుండపోత వర్షాలు * రోడ్లపై భారీగా నిలిచిపోయిన వరద నీరు
Heavy Rains: దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఢిల్లీతో పాటు గురుగావ్, ఫరీదాబాద్ నగరాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. లోనీ దేహత్, నోయిడాలతో పాటు సోనిపట్, గొహానా, హర్యానాలోని రోహ్ తక్, ఉత్తరప్రదేశ్‌లోని ఖేక్రా ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లపై భారీగా వరద నీరు నిలిచిపోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రోడ్లపై వాహనాలు నిలిచిపోతుండటంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. సాధారణంగా జూన్ నెలాఖరు సమయంలో ఢిల్లీని రుతుపవనాలు తాకుతుంటాయి. కానీ.. ఈ ఏడాది 15 రోజులు ఆలస్యంగా రుతుపవనాలు తాకాయి. దీంతో గాలి వేగం గంటకు 20 నుంచి 40 కిలోమీటర్ల వరకు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని సూచించింది వాతావరణ శాఖ.