ఏడోసారి చర్చలు కూడా ఎటూ తేలకపోవడంతో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు మరింత ఉద్ధృతం చేయాలని అన్నదాతలు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధానిలో కిసాన్ పరేడ్ పేరుతో భారీ ట్రాక్టర్ ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు. ఈ పరేడ్‌లో మహిళలు కూడా భాగస్వాములు కానున్నారు. ఇందుకోసం వారు ట్రాక్టర్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు. హర్యానాలోని జింద్‌లో భారతీయ కిసాన్ యూనియన్ ఆధ్వర్యంలో 5వందల మందికి పైగా మహిళలు ట్రాక్టర్లు నడపటంలో శిక్షణ తీసుకుంటున్నారు. వీరంతా రేపు కుండ్లీ, మనేసర్, పల్వాల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రదర్శన చేపట్టనున్నారు. మహిళలు డ్రైవింగ్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయ్.
ఢిల్లీ శివారుల్లో కొనసాగుతున్న ఉద్యమంలోనూ మహిళలు పాల్గొంటున్నారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తాము వెనక్కి తగ్గేది లేదని చట్టాలు రద్దు చేసేదాకా సరిహద్దుల నుంచి వెళ్లబోమని చెప్తున్నారు. ఇక అటు వ్యవసాయ చట్టాలపై కేంద్రం, రైతు సంఘాల ప్రతినిధుల మధ్య నిన్న జరిగిన ఏడో విడత చర్చలు విఫలమయ్యాయ్. చట్టాలను రద్దు చేయడం కుదరదని ఐతే అందులో సవరణలు చేస్తామని కేంద్రం చెప్తోంది. ఐతే రైతు నాయకులు దీనికి అంగీకరించలేదు. దీంతో ఎలాంటి పురోగతి లభించకపోవడంతో చర్చలకు జనవరి 8కి వాయిదా వేశారు.