TOP 6 NEWS:అమరావతికి రూ.15 వేల కోట్ల నిధులపై నిర్మలతో చంద్రబాబు చర్చలు.. మరో 5 ముఖ్యాంశాలు
నిర్మలా సీతారామన్ తో చంద్రబాబు భేటీ
చంద్రబాబు నాయుడు నవంబర్ 15 మధ్యాహ్నం దిల్లీకి చేరుకున్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై ఆయన కేంద్రమంత్రులతో వరుసగా సమావేశాలు చేయనున్నారు. అమరావతికి నిధులు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. రాజధాని నిర్మాణ పనులను ఏపీ ప్రభుత్వం చేపట్టింది. కేంద్రం నుంచి నిధుల విడుదలపై ఆయన కేంద్రమంత్రితో చర్చించారు. ఏడీబీ, ప్రపంచ బ్యాంకు ఇస్తున్న నిధులపై ఆయన మంత్రితో చర్చించారు.అంతకుముందు ఆయన ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ పై ప్రసంగించారు. మహిళలపై అనుచిత పోస్టులు పెట్టేవారిపై చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.
రేపు తెలంగాణ తిరగబడుతుంది: కేటీఆర్
కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని లగచర్లలో అధికారులపై దాడి చేశారనే ఆరోపణలతో అరెస్టైన వారిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం పరామర్శించారు. హైద్రాబాద్ నుంచి ఆయన సంగారెడ్డి జిల్లా జైలులో బాధితులను కలుసుకున్నారు. వారితో మాట్లాడారు. ధైర్యం చెప్పారు. ఈ ఘటనలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు కూడా ఉన్నారని... వారిని తప్పించి కేవలం బీఆర్ఎస్ శ్రేణుల పేర్లు మాత్రమే చేర్చారని ఆయన విమర్శించారు. ఇవాళ కొడంగల్ తిరగబడింది..రేపు తెలంగాణ తిరగబడుతుందన్నారు.
రాజీ చేసుకోండి:జయం రవి, ఆర్తి విడాకులపై కోర్టు సూచన
విడాకుల విషయంలో రాజీ కుదుర్చుకోవడానికి ప్రయత్నించాలని చెన్నై ఫ్యామిలీ కోర్టు సినీ నటులు జయం రవి, ఆర్తికి సూచించారు. కొన్ని రోజుల క్రితం తాను తన భార్య ఆర్తితో విడిపోతున్నట్టు ఆయన ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటన విడుదల చేసిన కొన్ని రోజులకు ఈ విడాకుల విషయాన్ని ఆమె వ్యతిరేకిస్తున్నట్టు మీడియాకు చెప్పారు. కానీ, అప్పటికే రవి విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై ఇవాళ విచారణ జరిగింది.
విచారణలో ఏం చెప్పారంటే?
తాను, తన భార్య కుటుంబ సభ్యుల మధ్య అనేక చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా రవి విచారణలో చెప్పారు. అయితే తనకు తెలియకుండానే విడాకుల ప్రకటన చేయడంపై ఆర్తి అభ్యంతరం చెప్పారు. తనకు చెప్పకుండానే తన ఇంట్లో వాళ్లు ఎలా విడాకులకు అంగీకరిస్తారని ఆమె ప్రశ్నించారు. తనకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని ఆర్తి చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.
రష్యా యుద్దాన్ని ఆపేస్తా: ట్రంప్
రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికే విషయమై చర్యలు చేపడుతున్నామని త్వరలో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డోనల్డ్ ట్రంప్ చెప్పారు. మార్-ఎ- లాగో బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తాను అధికారంలోకి వస్తే రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఇదే విషయమై రష్యా అధ్యక్ఝులు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్ స్కీ తో ఆయన ఫోన్ లో మాట్లాడినట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే తనకు ట్రంప్ ఫోన్ చేయలేదని పుతిన్ ప్రకటించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో అక్రమాలపై చర్యలు: మహేష్ కుమార్ గౌడ్
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అక్రమాలు జరిగాయని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని ప్రకటిస్తేనే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరారని ఆయన తెలిపారు.
మోదీ హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య.. టెన్షన్
నరేంద్ర మోదీ ప్రయాణించాల్సిన హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య ఏర్పడింది.శుక్రవారం జార్ఖండ్ లో ఎన్నికల ప్రచారం ముగించుకొని తిరిగి వెళ్తున్న సమయంలో ఇది జరిగింది. ఈ కారణంగానే మోదీ దిల్లీకి ఆలస్యంగా చేరుకున్నారని అధికారులు తెలిపారు. ఇవాళ ఉదయం జార్ఖండ్ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రాహుల్ గాంధీకి కూడా ఇదే రకమైన పరిస్థితి ఏర్పడింది.రాహుల్ ప్రయాణించాల్సిన హెలికాప్టర్ కు ఏటీసీ నుంచి అనుమతి రాలేదు. రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించిన గోడా ప్రాంతానికి ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించిన చకై ప్రాంతానికి మధ్య 150 కి.మీ. దూరం ఉంది. జార్కండ్ సీఎం హేమంత్ సోరేన్ కూడా ప్రధాని మోదీ కోసం తన పర్యటనను ఆలస్యం చేశారని ఆయన ఆరోపించారు.