Top 6 News @ 6PM: రూ.2 లక్షల రుణమాఫీపై మరోసారి క్లారిటీ ఇచ్చిన తుమ్మల.. మరో టాప్ 5 న్యూస్ హెడ్‌లైన్స్

Update: 2024-10-04 12:39 GMT

1) రుణమాఫీ చేసి తీరుతాం.. ఏ ఒక్క రైతు అధైర్యపడొద్దు

కచ్చితంగా రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రుణమాఫీ గురించి పట్టించుకోని పార్టీలు ఇప్పుడు మాట్లాడుతున్నాయన్నారు. కష్టమైనా అన్ని పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఏ ఒక్క రైతు అధైర్య పడవద్దని...రైతులు ఇబ్బంది పడకూడదని రేవంత్ కష్టపడుతున్నారని తెలిపారు. ప్రస్తుత సీజన్​ లో ఎక్కువుగా సన్నధాన్యాన్ని పండించారని.. అదనంగా రూ. 500 ఇచ్చి సన్నధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు.

2) తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

తిరుపతి లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో కల్తీ విషయమై విచారణకు స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ నుంచి ఇద్దరు, సిట్ నుంచి ఇద్దరు, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒకరు సభ్యులుగా ఉండాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. తిరుపతి లడ్డూకు ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందనే విషయం వెలుగు చూసిన తర్వాత సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానం విచారణ నిర్వహించింది. టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, సుబ్రమణ్యస్వామి సహా మరో ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిగింది. వైవీ సుబ్బారెడ్డి తరపున కపిల్ సిబల్, టీటీడీ తరపున సిద్దార్ధ్ లూథ్రా , తన పిటిషన్ పై సుబ్రమణ్యస్వామి వాదనలు వినిపించారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

3) చంద్రబాబుకు దేవుడంటే భయం, భక్తి లేదు

సుప్రీంకోర్టు తీర్పుతో సీఎం చంద్రబాబు నిజస్వరూపం బట్టబయలైందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. తిరుమల లడ్డూ కల్తీ ఇష్యూపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై జగన్ స్పందించారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహరంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించారు. దేవుడ్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేసిన జగన్.. సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు మత విశ్వాసాలను ఎలా రెచ్చగొడుతున్నాడో సుప్రీంకోర్టు అర్థం చేసుకుని ఆయనకు మొట్టికాయలు వేసిందని విమర్శించారు. కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ చంద్రబాబు పద్ధతి ప్రకారం అబద్ధాలు ఆడాడని, చంద్రబాబు స్వయంగా నియమించుకున్న టీటీడీ ఈవోనే చంద్రబాబు మాటలకు విరుద్ధంగా లడ్డూలపై ప్రకటన చేశాడని జగన్ వెల్లడించారు.

ఇన్ని ఆధారాలు కనిపిస్తుంటే ఎవరైనా కొద్దో, గొప్పో సిగ్గుపడతారని... దేవుడి విషయంలో ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు భయం, భక్తి ఉన్న వ్యక్తి అయితే అతడిలో పశ్చాత్తాపం అనేది రావాలని పేర్కొన్నారు. ప్రజలకు క్షమాపణ చెప్పేందుకు ముందుకు రావాలని అన్నారు. కానీ చంద్రబాబు ఎలాంటివాడంటే... పశ్చాత్తాపం ఉండదు, దేవుడంటే భయం ఉండదు, భక్తి ఉండదు అని జగన్ వ్యాఖ్యానించారు.

4) పవన్ కల్యాణ్ సనాతన ధర్మం కామెంట్స్‌ తమిళనాడులో డీఎంకేకు ఎందుకు కోపం తెప్పించాయంటే

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సనాతన ధర్మం గురించి చేసిన కామెంట్స్ తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకే పార్టీకి ఆగ్రహం తెప్పించాయి. పవన్ కల్యాణ్ నిన్న తిరుపతిలో వారాహి సభలో చేసిన వ్యాఖ్యలపై డిఎంకే అధికార ప్రతినిధి డా సయ్యద్ హఫీజుల్లా స్పందిస్తూ బీజేపి, టీడీపీ, పవన్ కల్యాణ్‌పై నేరుగా విమర్శలు చేశారు. "బీజేపి, టీడీపీ, పవన్ కల్యాణ్‌ రాజకీయ ప్రయోజనాల కోసం హిందూయిజం పేరును, హిందూ దేవుళ్లను వాడుకున్నారు. తామెప్పుడూ హిందూయిజం గురించి కానీ లేదా ఒక మతం గురించి వ్యతిరేకంగా మాట్లాడలేదు. తమ పోరాటం అంతా కుల వ్యవస్థపై, అంటరానితనంపై, కులం పేరుతో జరుగుతున్న అరాచకాలపైనే" అని సయ్యద్ హఫీజుల్లా స్పష్టంచేశారు. హిందూ మతానికి వాళ్లే అసలైన శత్రువులు అని సయ్యద్ అభిప్రాయపడ్డారు. వాళ్లు తీసుకున్న నిర్ణయాల వల్ల కోట్ల మందికి జరిగిన నష్టాన్ని కప్పిపుచ్చుకుని, జనం దృష్టిని మరల్చేందుకే ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారని పవన్ కల్యాణ్‌కి సయ్యద్ హఫీజుల్లా కౌంటర్ ఇచ్చారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

5) ‘బృందావనం’తో మా ఇంటి సభ్యుడిగా మారిన కొరటాల శివ.. దేవర సక్సెస్ పార్టీలో తారక్

ఎన్టీఆర్ తాజా చిత్రం ‘దేవర’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దేవర సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో చిత్ర నిర్మాతల్లో ఒకరయిన సుధాకర్ మిక్కిలినేని, సినిమాను తెలుగు రాష్ట్రాల్లో హోల్‌ సేల్‌‌గా కొనుగోలు చేసిన నిర్మాత నాగవంశీ సక్సెస్ పార్టీ ఏర్పాటు చేశారు. 'దేవర' టీం తో పాటు రాజమౌళి ఇంకా పలువురు సినీ ప్రముఖులు ఈ సక్సెస్ పార్టీలో పాల్గొన్నారు. జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు దేవర యూనిట్‌ సభ్యులకు సక్సెస్ పార్టీకి హాజరయిన అతిథులు శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

6) ఇజ్రాయిల్ - ఇరాన్ యుద్ధంలో అదే జరిగితే, భారత్, చైనాలకు ఈ పెద్ద ఇబ్బంది తప్పదు.. ఏంటో తెలుసుకోండి..?

పశ్చిమాసియా దేశాల్లో ఇరాన్ ఇజ్రాయిల్ మధ్యలో ప్రస్తుతం యుద్ద వాతావరణ నెలకొని ఉంది. ఇటీవల ఇజ్రాయిల్ పై ఇరాన్ ఏకంగా 200 బాలిస్టిక్ మిసైళ్లతో విరుచుకుపడింది. దీంతో ప్రస్తుతం ఇజ్రాయిల్ కూడా ఇరాన్ పై ప్రతికార దాడులకు సిద్ధమవుతోంది. అయితే పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న ఈ యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలపై పెద్ద ఎత్తున ఎఫెక్ట్ చూపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Tags:    

Similar News