Top 6 News @ 6 PM: తప్పు చేసిన వారిని వదలను..చంద్రబాబు: మరో ఐదు ముఖ్యాంశాలు

Top 6 News @ 6pm: ఇవాళ నవంబర్ 1న తెలంగాణ, ఏపీ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా రంగాల్లో చోటుచేసుకున్న ముఖ్యమైన ఘటనలు...

Update: 2024-11-01 12:30 GMT

Top 6 News @ 6 PM: తప్పు చేసిన వారిని వదలను..చంద్రబాబు: మరో ఐదు ముఖ్యాంశాలు

Top 6 News @ 6pm: ఇవాళ నవంబర్ 1న తెలంగాణ, ఏపీ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా రంగాల్లో చోటుచేసుకున్న ముఖ్యమైన ఘటనలు, వాటికి సంబంధించిన వార్తాంశాలను ఒకే చోట పొందుపరుస్తూ టాప్ 6 న్యూస్ @ 6PM పేరుతో క్లుప్తంగా మీ ముందుకు తీసుకురావడం జరుగుతోంది.

1. తప్పు చేసిన వారిని వదలను: శ్రీకాకుళం సభలో చంద్రబాబు

ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించారు. ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో శాంతమ్మ అనే మహిళకు ఉచిత గ్యాస్ సిలిండర్ ను ఆయన అందించారు. శాంతమ్మ ఇంట్లో చంద్రబాబు టీ చేసి తాగారు. ప్రతి ఏడాది మూడు సిలిండర్లను ప్రభుత్వం లబ్దిదారులకు అందిస్తోంది. ఈ స్కీమ్ కింద బుకింగ్ ను మూడు రోజుల క్రితమే ప్రారంభించారు. ఈ పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. తప్పు చేసిన వారిని వదిలి పెట్టను... రాజకీయ కక్షసాధింపులకు పోనని చంద్రబాబు చెప్పారు. వైఎస్ఆర్ సీపీ నాయకులు ప్రజస్వామ్య హద్దులు దాటి ఇబ్బంది పెట్టారని ఆయన గుర్తు చేశారు.

2. పాదయాత్రకు సిద్దం: కేటీఆర్

రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. సోషల్ మీడియాలో ఆస్క్ కేటీఆర్ క్యాంపెయిన్ లో భాగంగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. పాదయాత్ర విషయమై అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. పార్టీ కార్యకర్తలు కోరుకుంటే భవిష్యత్తులో పాదయాత్ర చేస్తానని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఈ యాత్రలో ప్రజలకు వివరిస్తానని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2025 లో కేసీఆర్ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటారని ఆయన ఓ నెటిజన్ ప్రశ్నకు సమాధానమిచ్చారు.

3. రెడ్ బుక్ మూడో చాప్టర్: నారా లోకేష్

రెడ్ బుక్ మూడో చాప్టర్ ను ఓపెన్ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. అమెరికా అట్లాంటాలో శుక్రవారం ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. రెడ్ బుక్ రెండు చాప్టర్లు ఓపెన్ అయ్యాయి. మూడో చాప్టర్ ఓపెన్ అవ్వాలంటే ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావు కష్టపడాలని ఆయన అన్నారు. యువగళం యాత్రలో తనను జగన్ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి సినిమా చూపిస్తామని లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. జగన్ వ్యవహరించినట్టుగా తాము వ్యవహరించబోమని స్పష్టం చేశారు.

4. మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీలో 7,994 మంది అభ్యర్ధులు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 7,994 మంది అభ్యర్ధులు పోటీలో నిలిచారు. రాష్ట్రంలో 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న పోలింగ్ నిర్వహిస్తారు. వివిధ కారణాలతో 921 నామినేషన్ పేపర్లను అధికారులు తిరస్కరించారు. రాష్ట్రంలో 9.7 కోట్ల మంది ఓటర్లున్నారు. ఇందులో కొత్తగా ఓటర్లు నమోదైన వారి సంఖ్య 2 శాతం. మొత్తం ఓటర్లలో 5 కోట్ల మంది పురుషులు. 4.6 కోట్ల మంది మహిళలు. కొత్తగా ఓటు హక్కు పొందిన ఓటర్లు 22.222 లక్షల మంది ఉన్నారు.

5. చేవేళ్ల ఎక్సైజ్ విచారణకు హాజరైన రాజ్ పాకాల

జన్వాడ ఫాం హౌస్ పార్టీ కేసులో భాగంగా రాజ్ పాకాల చేవేళ్ల ఎక్సైజ్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. అక్టోబర్ 26న జరిగిన పార్టీ గురించి రాజ్ పాకాలను ఎక్సైజ్ అధికారులు విచారించారు. ఈ పార్టీలో పాల్గొన్న విజయ్ మద్దూరికి డ్రగ్ టెస్టులో పాజిటివ్ వచ్చింది. ఈ విషయమై ఎక్సైజ్ అధికారులు ప్రశ్నించారని తెలుస్తోంది. ఇదే కేసులో రెండు రోజుల క్రితం మోకిల పోలీసుల విచారణకు ఆయన హాజరయ్యారు.

6. అమెరికా అధ్యక్ష ఎన్నికలు: ఇప్పటికే ఓటేసిన 6 కోట్ల మంది

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు నవంబర్ 5న పోలింగ్ జరగనుంది. అయితే ముందస్తు ఓటింగ్ కు అనుమతి తీసుకున్న 6.1 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధిగా కమలా హారిస్, రిపబ్లిక్ పార్టీ అభ్యర్ధిగా డొనాల్డ్ ట్రంప్ బరిలో ఉన్నారు. తన ఇంటికి సమీపంలోని పోలింగ్ కేంద్రంలో అమెరికా అధ్యక్షులు జో బైడెన్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జార్జియా, నార్త్ కరోలినాలలో హారిస్, ట్రంప్ మధ్య పోటీ నువ్వా, నేనా అన్నట్టుగా ఉందని తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి.

Full View


Tags:    

Similar News