Top 6 News Of The Day: ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హంజా ఇంకా బతికే ఉన్నాడా? మరో టాప్ 5 న్యూస్ హెడ్‌లైన్స్

Update: 2024-09-14 12:33 GMT

1) హైదరాబాద్‌ ప్రజల మీద సీఎం రేవంత్‌ పగబట్టారు

హైదరాబాద్‌లో శాంతిభద్రతలు కంట్రోల్ చేయలేని ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి మిగిలిపోతారని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కొండాపూర్‌లోని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి ఇంటికి వెళ్లిన కేటీఆర్‌.. ఎమ్మెల్యేను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. దాడి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ నేతల ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే దాడులు చేస్తున్నారన్నారు. కౌశిక్‌ రెడ్డి ఏం తప్పు మాట్లాడారని ప్రశ్నించారు. పార్టీ మారిన వారు దమ్ముంటే రాజీనామా చేయాలని కోరారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలన్నారు.

వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలను ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. ఓ వైపు హైడ్రా పేరుతో హైడ్రామ చేస్తూ, ఎమ్మెల్యేల ఇంటికే గూండాలను పంపిస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రాంతీయ బేధాలు ఎప్పుడూ కనిపించలేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలోనే ప్రాంతీయ తత్వం రెచ్చగొట్టే విధంగా చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్‌ను ప్రశాంతంగా ఉంచినట్లు చెప్పారు. అందుకే హైదరాబాద్ ప్రజలు తమను భారీ మెజార్టీతో గెలిపించారన్నారు. తమను గెలిపించలేదనే కక్షతోనే సీఎం రేవంత్‌ హైదరాబాద్ ప్రజలపై కక్షకట్టారని అన్నారు కేటీఆర్.

2) ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై హత్యాయత్నం కేసునమోదు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫిర్యాదు మేరకు అరికెపూడి గాంధీతో పాటు ఆయన కుమారుడు, సోదరుడిపైనా గచ్చిబౌలి పోలీసులు కేసు పెట్టారు. మరో ఇద్దరు కార్పొరేటర్లు వెంకటేశ్ గౌడ్, శ్రీకాంత్‌గౌడ్‌లపైనా కేసు నమోదు అయింది. ఘటనపై ఎస్ఐ మహేశ్ ఇచ్చిన ఫిర్యాదుతో రెండ్రోజుల క్రితమే ఒక కేసునమోదు చేశారు పోలీసులు. ఆ కేసులో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ బెయిల్ తీసుకున్నారు. తాజాగా కౌశిక్ రెడ్డి ఫిర్యాదుతో అరికెపూడి గాంధీపై హత్యాయత్నం కేసును ఫైల్ చేశారు. ఇదిలా ఉంటే అరికెపూడి గాంధీ,కౌశిక్ రెడ్డిల మధ్య మూడు రోజులుగా వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. గురువారం నాడు అరికెపూడి గాంధీ తన అనుచరులతో కలిసి కౌశిక్ రెడ్డి ఇంటి ముందు ఆందోళనకు దిగగా.. జనాల్లో కొంతమంది కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడికి చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు అరికెపూడి గాంధీని ౩౦ మందికి పైగా ఆయన అనుచరులను అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే ముందుగా ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేయకపోయినా తాజాగా ఈ సెక్షన్‌ ౩౦7ని కూడా చార్జ్ షీట్‌లో నమోదు చేశారు.

3) కాదంబరి జత్వానీ ఫిర్యాదు: వైఎస్ఆర్సీపీ నేత కుక్కల విద్యాసాగర్ పై కేసు

కాదంబరి జత్వానీ ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పోలీసులు వైఎస్ఆర్ సీపీ నాయకులు కుక్కల విద్యాసాగర్ సహా మరికొందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఆమె ఫిర్యాదు చేయడంతో 192, 218, 211, 354,220,467,420,471 రెడ్ విత్ 120 బి సెక్షన్ల కింద కేసు చేశారు. శుక్రవారం రాత్రి పేరేంట్స్, న్యాయవాదులతో కలిసి ఆమె ఇబ్రహీంపట్నం సీఐకు ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్ సీపీ నాయకులు విద్యాసాగర్ తో తప్పుడు ఫిర్యాదు చేయించారని చెప్పారు. ఈ ఫిర్యాదు ఆధారంగా తనతో పాటు తన పేరేంట్స్ ను ముంబైలో అరెస్ట్ చేశారని ఆమె చెప్పారు. ఏ తప్పు లేకపోయినా తమ కుటుంబం 42 రోజులు జైల్లో ఉన్నారని తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు శనివారం అందించారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

4) ఈ నెల 16న గుజరాత్‌ కు ఏపీ సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు గుజరాత్ పర్యటన ఖరారు అయింది. ఈ నెల 16న గుజరాత్‌లో కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ ఆధ్వర్యంలో జరగనున్న సదస్సుకు హాజరుకానున్నారు. గాంధీనగర్‌లో గ్లోబల్ రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్‌ జరగనుంది. మూడు రోజుల పాటు జరగనున్న సదస్సును ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ దిశానిర్దేశం చేయనున్నారు. గుజరాత్, ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల భాగస్వామ్యంతో ఇన్వెస్టర్స్ సదస్సు జరగనుంది.

5) ఇదే ఆఖరి ప్రయత్నంగా చెబుతున్నా.. డాక్టర్లతో మమతా బెనర్జి కీలక వ్యాఖ్యలు వీడియో

కోల్‌కతా డాక్టర్ రేప్, మర్డర్ ఘటనని నిరసిస్తూ అక్కడి డాక్టర్లు నిరవధిక సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ధర్నా ముగించి విధుల్లో చేరాల్సిందిగా పలుమార్లు పశ్చిమ బెంగాల్ సర్కారుతో పాటు సుప్రీం కోర్టు కూడా చెప్పి చూశాయి. కానీ హత్యాచారానికి గురైన డాక్టర్ కుటుంబానికి న్యాయం జరగడంతో పాటు డాక్టర్ల డిమాండ్లను పరిష్కరించే వరకు ధర్నా విరమించేది లేదని డాక్టర్లు తెగేసి చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జి ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయమైన స్వస్త్య భవన్ కి చేరుకున్నారు. అక్కడ ధర్నాలో కూర్చున్న డాక్టర్లతో ఆమె మాట్లాడారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

6) ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హంజా బతికే ఉన్నాడా?

హంజా బిన్ లాడెన్.. ఆల్ ఖైదాను స్థాపించిన ఒసామా బిన్ లాడెన్ కుమారుడు. అతడు ఇంకా బతికే ఉన్నారని ఇంటలిజెన్స్ నివేదికలు సూచిస్తున్నాయని ‘ది మిర్రర్’ తెలిపింది. ఆల్ ఖైదాను పునరుద్దరించేందుకు హంజా కీలకంగా వ్యవహరిస్తున్నారని ది మిర్రర్ రిపోర్ట్ చేసింది. 2019లో జరిగిన ఆపరేషన్‌లో హంజా చనిపోయాడని అప్పట్లో అమెరికా ప్రకటించింది. కానీ, దీనికి విరుద్దంగా ది మిర్రర్ రిపోర్ట్ చేసిందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కూడా ఒక కథనం ప్రచురించింది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Tags:    

Similar News