Top 6 News @ 6PM: పవన్ కళ్యాణ్‌తో భేటీ కానున్న బాలినేని.. జానీ మాస్టర్ ఎక్కడ? మరో టాప్ 4 న్యూస్ హెడ్‌లైన్స్
తెలంగాణ హైకోర్టులో బీఆర్‌ఎస్‌కు చుక్కెదురైంది. నల్గొండ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌ను కూల్చేయాలని ఆదేశించింది ధర్మాసనం. 15రోజుల్లో పార్టీ కార్యాలయాన్ని కూల్చేయాలని సూచించింది.
1) బీఆర్‌ఎస్‌కు షాక్.. పార్టీ ఆఫీస్ కూల్చివేతకు హైకోర్టు ఆదేశాలు..
తెలంగాణ హైకోర్టులో బీఆర్‌ఎస్‌కు చుక్కెదురైంది. నల్గొండ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌ను కూల్చేయాలని ఆదేశించింది ధర్మాసనం. 15రోజుల్లో పార్టీ కార్యాలయాన్ని కూల్చేయాలని సూచించింది. పార్టీ కార్యాలయాన్ని రెగ్యులర్ చేసేవిధంగా మున్సిపల్‌శాఖ అధికారులకు ఆదేశాలివ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది బీఆర్‌ఎస్. పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. పార్టీ ఆఫీస్ కట్టిన తర్వాత ఏరకంగా అనుమతిస్తారని ప్రశ్నించింది. కట్టకముందు అనుమతి తీసుకోవాలి కానీ, కట్టిన తర్వాత ఎలా అనుమతి తీసుకుంటారని హైకోర్టు మొట్టికాయలు వేసింది. 15 రోజుల్లో పార్టీ కార్యాలయాన్ని కూల్చేయాలని ఆదేశించిన ధర్మాసనం.. లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని తెలిపింది.
2) వైసీపీకి మాజీ మంత్రి బాలినేని రాజీనామా.. రేపు పవన్ కళ్యాణ్ తో భేటీ..
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను జగన్‌కు పంపించారు పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. కొన్ని కారణాల రీత్యా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజీనామా లేఖలో ఆయన కీలక విషయాలను ప్రస్తావించారు. జగన్ నిర్ణయాలు సరిగా లేనప్పుడు తాను వ్యతిరేకించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాజకీయాల్లో భాష, గౌరవంగా, హుందాతనంగా ఉండాలని ఆయన చెప్పారు. రాజకీయాల్లో విలువలు కాపాడాల్సిన బాధ్యత మనదేని ఆయన చెప్పారు. రాజకీయాలు వేరు, బంధుత్వాలు వేరని ఆయన ఆ లేఖలో చెప్పారు. విలువలు నమ్ముకుని ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా.. రెండుసార్లు మంత్రిగా పనిచేశానని ఆయన తెలిపారు. బాలినేని రాజీనామా పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
3) మరో ఎన్నికల హామీ అమలు దిశగా కూటమి సర్కారు కసరత్తు
ఏపీలో మరో హామీ అమలుకు కసరత్తు ప్రారంభమైంది. ఎన్నికల సమయంలో బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తెస్తామని కూటమి హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ ప్రకారం బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ రూపకల్పనకు కసరత్తు ప్రారంభమైంది. బీసీ సంక్షేమశాఖ అధికారులతో జరిగిన సమావేశంలో బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ రూపకల్పనకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అలాగే ఏపీవ్యాప్తంగా బీసీ భవనాలను నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇప్పటికే నిర్మాణం ప్రారంభమై అసంపూర్తిగా ఉన్నవాటికి నిధులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని మంత్రి సవిత వెల్లడించారు. బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ రూపొందించాలని చంద్రబాబు ఆదేశించారన్న మంత్రి.. చట్ట సభల్లో బీసీలకు ప్రాతినిథ్యం పెంచేలా కేంద్రానికి సిఫార్సు చేస్తామన్నారు. ఏపీలో ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం పునరుద్ధరిస్తామన్న చంద్రబాబు నాయుడు.. విదేశీ విద్యాసంస్థలలో అత్యధిక మంది విద్యార్థులకు చదువుకునే అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
4) జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం
జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ నివేదికకు మంత్రివర్గం ఆమోదం ప్రకటించింది. వచ్చే శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ ముందుకు బిల్లు రానుంది. కోవింద్ కమిటీ 18వేల 626 పేజీల నివేదికను రాష్ట్రపతి ముర్ముకు అందజేసింది. 2023 సెప్టెంబర్ 2న కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. 47 పొలిటికల్ పార్టీల నుంచి సలహాలు, సూచనలను కమిటీ సేకరించింది.
5) జానీ మాస్టర్ కనిపించుట లేదు... గాలిస్తున్న పోలీసు ప్రత్యేక బృందాలు
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీబాషాపై రేప్ కేసు నమోదైంది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో ఆయనపై నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీంతో ఆయనను డ్యాన్సర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని ఫిలిం చాంబర్ ఆప్ కామర్స్ సిఫారసు చేసింది. ఈ కేసు నమోదైన తర్వాతి నుంచి జానీ మాస్టర్ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
6) లెబనాన్ పేజర్లలో ఇజ్రాయెల్ బాంబులు ఎలా పెట్టింది? ఎలా పేల్చింది?
లెబనాన్, హెజ్‌బొల్లాను షాక్‌కి గురి చేసిన దాడి ఇది. పేజర్లు బాంబులై పేలిపోయాయి. దాదాపు గంట వ్యవధిలో వేల సంఖ్యలో పేజర్లు పేలిపోయిన ఘటనలో తొమ్మిది మంది చనిపోయారు. దాదాపు మూడు వేల మంది గాయపడ్డారు. ఇది ఇజ్రాయెల్ చేసిన పనేనని లెబనాన్‌తో పాటు హెజ్‌బొల్లా మిలిటెంట్ సంస్థ అగ్ర నాయకులు ఆరోపిస్తున్నారు. హెజ్‌బొల్లాకు మద్దతునిస్తున్న ఇరాన్ కూడా ఇది ఇజ్రాయెల్ పనే అని అంటోంది. లెబనాన్, హెజ్‌బొల్లా, ఇరాన్ చేస్తోన్న వరుస ఆరోపణలతో ఈ దాడి వెనుక ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొసాద్ ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లెబనాన్‌లో పేజర్ల పేలుళ్లపై సమగ్రమైన వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.