Top 6 News @ 6PM: ఏపీలోనూ హైడ్రా తరహా వ్యవస్థ.. 15 ఏళ్లు దాటితే బండ్లు ఇక షెడ్డుకే.. మరో టాప్ 4 న్యూస్ హెడ్‌లైన్స్

Update: 2024-09-19 12:41 GMT

1) 15 ఏళ్లు దాటిన వాహనాలకు రోడ్లపైకి నో పర్మిషన్: జనవరి నుంచి అమలుకు రేవంత్ సర్కార్ ప్లాన్

కాలుష్యానికి కారణమయ్యే వాహనాలను స్క్రాప్ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. 2025 జనవరి 1 నుంచి 15 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉన్న వాహనాలను, ఫిట్‌నెస్ పరీక్షల్లో ఫెయిలైన వాహనాలను రోడ్లపైకి అనుమతించరు. లేదా ఇలాంటి వాహనాలను రిజిస్ట్రేషన్ కూడా చేయవద్దని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాహనాలకు ఫిట్‌నెస్ పరీక్షలు ఫిట్‌నెస్ పరీక్షల్లో పాసైన వాహనాలు గ్రీన్ ట్యాక్స్ చెల్లిస్తే మరో మూడు నుంచి 5 ఏళ్ల పాటు పనిచేసేందుకు అనుమతిస్తారు. అయితే 15 ఏళ్లు దాటిన ప్రభుత్వ వాహనాలను కూడా స్క్రాప్ చేయనున్నారు. ఇలాంటి వాహనాలను ప్రభుత్వ శాఖల్లో 10 వేలు ఉన్నాయి. దిల్లీలో మాత్రమే ప్రస్తుతం 15 ఏళ్లు దాటిన వాహనాలను రోడ్లపైకి అనుమతించడం లేదు. కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్ సహా ఇతర రాష్ట్రాలు ప్రతిపాదించిన విధానాలను తెలంగాణలో కూడా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

2) ఏపీలోనూ హైడ్రా తరహా వ్యవస్థ

ఏపీలోనూ హైడ్రా తరహా వ్యవస్థను తీసుకొస్తామని మంత్రి పార్థసారథి వెల్లడించారు. ఇవాళ ఏపీ సచివాలయంలో మీడియాతో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ... త్వరలోనే ఏపీలో కూడా హైడ్రా తరహాలో అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. జగనన్న కాలనీల్లో అక్రమ నిర్మాణాలపై విచారణ ముగిసిందని చెప్పారు. నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని పార్థసారధి స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో పనిచేసిన ప్రజాప్రతినిధులే చాలా అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఆరోపణలు చేశారు. వాటిపై కూడా ప్రత్యేక దృష్టిసారించి కూల్చివేతలకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జర్నలిస్టుల సమస్యలపై త్వరలోనే యూనియన్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

3) జనసేనలోకి భారీగా చేరికలు.. అందరి చూపు అటువైపే

జనసేనలోకి భారీగా చేరికలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ నేతల్లో చాలా మంది ప్రస్తుత, మాజీలు జనసేన వైపు చూస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. రెండు, మూడు రోజుల్లో వైసీపీకి చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు వరుసగా సమావేశం కానున్నారు. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలార్ రోశయ్య, దర్శి మాజీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, పవన్‌కల్యాణ్ అపాయింట్‌మెంట్ కోసం జోగి రమేష్ ప్రయత్నాలు చేస్తున్నారట.

4) జాతీయ పార్టీల మధ్య లేఖల యుద్ధం

జాతీయ పార్టీల మధ్య లేఖల యుద్దం తారాస్థాయికి చేరింది. ప్రధాని మోడీకి ఖర్గే రాసిన లేఖకు జేపీ నడ్డా కౌంటర్ లేఖ రాశారు. రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఖర్గే ప్రధాని మోడీకి లేఖ రాశారు. తాజాగా ఖర్గే లేఖపై జేపీ నడ్డా కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తూ కౌంటర్ లెటర్ రాశారు. ప్రజలచే పదే పదే తిరస్కరణకు గురైన మీ విఫలమైన ఉత్పత్తి, విధానాలను మెరుగుపర్చి.. రాజకీయ బలవంతంతో ప్రజల ముందుకు తీసుకెళ్లడానికే మీరు లేఖ రాశారన్నారు. ఆ లేఖలో మీరు చెప్పిన విషయాలు వాస్తవాలకు చాలా దూరంగా ఉన్నాయని అన్పించిందన్నారు. మీరు రాసిన లేఖలో రాహుల్ గాంధీ సహా మీ నాయకుల అకృత్యాలను ఉద్దేశపూర్వకంగా మర్చిపోయినట్లు అన్పిస్తుందన్నారు. ఆ విషయాలను మీ దృష్టికి వివరంగా తీసుకురావాలని భావించానని.. దేశంలోని పురాతన రాజకీయ పార్టీ.. ప్రస్తుతం యువరాజు రాహుల్ గాంధీ ఒత్తిడితో కాపీ అండ్ పేస్ట్ పార్టీగా మారపోవడం బాధాకరమన్నారు జేపీ నడ్డా.

5) నాకే కెమెరా పెడతారా?.. మీడియాపై జానీ మాస్టర్ భార్య చిందులు

నార్సింగి పోలీస్‌స్టేషన్‌కి జానీ మాస్టర్ భార్య సుమలత చేరుకున్నారు. జానీ మాస్టర్‌కి వచ్చిన ఫేక్ కాల్‌పై సమాచారం తెలుసుకోవడానికి వచ్చినట్టు జానీమాస్టర్ భార్య సుమలత అలియాస్ ఆయేషా తెలిపారు. కాగా జానీమాస్టర్‌‌ను గోవాలో అరెస్ట్ చేసిన హైదరాబాద్ SOT పోలీసులు బయలుదేరారు. అయితే జానీ మాస్టర్ భార్య సైతం తనపై దాడికి పాల్పడిందని ఇప్పటికే బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొనడంతోస్టేషన్‌కు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే కేసు విషయమై స్పందన అడిగిన మీడియా ప్రతినిధులపై ఆయేషా చిందులేశారు. నాకే కెమెరా పెడతారా... మీపై కేసు పెడతానంటూ మీడియా ప్రతినిధులను బెదిరిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

6) జానీ మాస్టర్ అరెస్ట్.. హైదరాబాద్‌ తీసుకొస్తున్న పోలీసులు..!

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను హైద్రాబాద్ ఎస్ ఓ టీ పోలీసులు గోవాలో గురువారం అదుపులోకి తీసుకున్నారు.ట్రాన్సిట్ వారెంట్ పై ఆయనను హైద్రాబాద్ కు తీసుకువస్తున్నారు. మహిళా కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై రేప్ కేసు నమోదైంది. అప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. నెల్లూరు, లడాఖ్ లలో జానీ మాస్టర్ ఉన్నారనే సమాచారంతో ప్రత్యేక పోలీస్ బృందాలు అక్కడికి వెళ్లాయి. అయితే గోవాలో ఆయన ఉన్నారనే పక్కా సమాచారంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నార్సింగి పోలీసులను ఆశ్రయించడానికి మూడు వారాల ముందే ఈ విషయమై బాధితురాలు ఫిలిం ఛాంబర్ కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై ఫిలిం చాంబర్ విచారణ జరుపుతోంది. జానీ మాస్టర్ తో పాటు బాధితురాలి స్టేట్ మెంట్ ను కూడా తీసుకున్నారు. బాధితురాలికి అండగా ఉంటామని ఛాంబర్ హామీ ఇచ్చింది. మరోవైపు ఇదే విషయమై మహిళా సంఘాల ప్రతినిధులు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. బాధితురాలికి రక్షణ కల్పించాలని మహిళా కమిషన్ పోలీసులను ఆదేశించింది.

Tags:    

Similar News