ఈరోజు తమిళనాడుకు శశికళ రాక
* ఘన స్వాగతానికి అభిమానుల ఏర్పాట్లు * పోస్టర్లు, బ్యానర్లతో నిండిపోయిన టీ నగర్ * నిఘా వలయంలో అన్నాడీఎంకే కార్యాలయం
మిళనాడుకు చెందిన AIADMK బహిష్కృత నాయకురాలు శశికళ ఇవాళ తమిళనాడుకు రానున్నారు. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల పాటు బెంగళూరులో జైలు శిక్ష అనుభవించిన ఆమె ఇటీవల విడుదలయ్యారు. కరోనా పాజిటివ్ రావడంతో చికిత్స పొంది కోలుకున్నారు. అయితే చెన్నై టీ నగర్‌లోని బంధువుల ఇంటికి శశికళ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె అభిమానులు చెన్నై నగరంలో భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. చిన్నమ్మ శశికళ అంటూ పోస్టర్లు, బ్యానర్లు పెట్టారు.
మరోవైపు శశికళను పార్టీ నుంచి బహిష్కరించామని, ఆమెను తిరిగి పార్టీలోకి ఆహ్వానించబోమని సీఎం పళని స్వామి ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే పార్టీలోని సగం మంది ఎమ్మెల్యేలు, నేతలు చిన్నమ్మ శశికళకు మద్దతిస్తున్నాట్లు తెలుస్తోంది. ఆమె రాకతో అన్నాడీఎంకే కార్యాలయం ముందు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రానున్న తమిళ ఎన్నికల్లో శశికళ ప్రభావం చాలా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమె ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి.
టీనగర్ హబీబుల్లా రోడ్డులో ఆమె బస చేయడానికి తగ్గట్టుగా ఓ భవనం సిద్ధమైంది. ఇది ఆమె వదినమ్మ ఇలవరసి కుటుంబానికి చెందింది. తమిళనాడు సరిహద్దులోని హొసూరు నుంచి చెన్నై వరకు రోడ్డు మార్గంలో ఏడు జిల్లాల మీదుగా శశికళ పయనం సాగనుంది. దీంతో ఆయా జిల్లాల్లో 66 చోట్ల ఆహ్వాన ఏర్పాట్లు జరిగాయి. అన్నాడీఎంకే జెండా కల్గిన కారులోనే ఆమె రానున్నట్టు సమాచారం వెలువడింది. శశికళకు భద్రత కల్పించాలని కళగం ప్రధాన కార్యదర్శి దినకరన్ తరఫున ఓ విజ్ఞప్తి ఆదివారం కమిషనరేట్‌కు చేరింది.
శశికళ రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయానికి వచ్చిన పక్షంలో ఆమెను అడ్డుకునేందుకు అధికార పక్షం ముందస్తు చర్యలు తీసుకుంది. ఆ కార్యాలయం చుట్టూ ఉన్న మార్గాల్ని నిఘా వలయంలోకి తీసుకొచ్చారు. అలాగే, జయలలిత సమాధి సందర్శనకు అనుమతి రద్దు చేసిన దృష్ట్యా, శశికళ వెళ్లిన పక్షంలో అక్కడ కూడా అడ్డుకునేందుకు భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు.