సంక్రాంతి పర్వదినాన శబరిమలలో మకరజ్యోతి దర్శనం ఇవ్వనుంది. పొన్నంబలమేడు కొండల్లో ఈ సాయంత్రం మకర జ్యోతి కనిపించనుంది. జ్యోతి దర్శనం కోసం ప్రతి ఏడాది మాదిరిగానే భారీ సంఖ్యలో భక్తులు శబరిమల చేరుకుంటున్నారు. అయ్యప్ప భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. సంక్రాంతి రోజున జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి దర్శనం ఇస్తాడని భక్తులు నమ్ముతారు. జ్యోతి దర్శనం ఇవ్వగానే భక్తులు ఆనంద పరవశానికి లోనవుతారు.
కరోనా నేపథ్యంలో ఆలయ అధికారులు శబరిమలలో కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. శబరిమలకు వచ్చే భక్తులు కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ తీసుకుని రావాలని సూచించారు. 48 గంటల్లోపు తీసిన కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ మాత్రమే చెల్లుబాటు అవుతుంది. యాంటిజెన్ టెస్ట్ రిపోర్ట్ చెల్లదు. ఖచ్చితంగా ఆర్టీపీసీఆర్ పరీక్షను చేయించుకోవాలి. మకర సంక్రాంతి పూజలు, మకర జ్యోతి దర్శనం అనంతరం జనవరి 20న ఆలయాన్ని మూసివేస్తామని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డ్ వెల్లడించింది.