Lok Sabha Elections 2024: నేడు లోక్‌సభ ఎన్నికల చివరి విడత పోలింగ్

Lok Sabha Elections 2024: చివరి విడతలో 57 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్‌

Update: 2024-06-01 03:01 GMT

Lok Sabha Elections 2024: నేడు లోక్‌సభ ఎన్నికల చివరి విడత పోలింగ్

Lok Sabha Elections 2024: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరింది. ఎన్నికల్లో భాగంగా ఆఖరి విడత పోలింగ్‌ కొనసాగుతోంది. కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్‌ పాటు బిహార్, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభమయ్యింది.

వీటితో పాటు ఒడిశా శాసనసభ ఎన్నికల్లో మిగిలిన 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు సైతం పోలింగ్‌ నిర్వహిస్తారు. అంతేకాకుండా బిహార్‌ ఒకటి, ఉత్తరప్రదేశ్‌లో ఒకటి, పశ్చిమ బెంగాల్‌లో ఒకటి, హిమాచల్‌ప్రదేశ్‌లో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఉపఎన్నిక జరుగనుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.

చివరి విడతలోని 57 లోక్‌సభ స్థానాల్లో 2019 ఎన్నికల్లో ఎన్డీఏ 32, యూపీఏ 9 సీట్లు దక్కించుకున్నాయి. మిగతా స్థానాలను ఇతర పార్టీలు గెలుచుకున్నాయి. ఏప్రిల్‌ 19న ప్రారంభమైన సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటిదాకా జరిగిన ఆరు దశల్లో 486 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ ప్రక్రియ పూర్తయ్యింది. కాగా మొత్తం ఏడు దశల్లోని 543 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు, 13 రాష్ట్రాల్లోని 26 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ జూన్‌ 4న ప్రారంభం కానుంది. అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ జూన్‌ 2న ప్రారంభమవుతుంది. 

Tags:    

Similar News