Congress: ఇవాళ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థుల ఫస్ట్‌లిస్ట్ ప్రకటించే అవకాశం
Congress: 9 నుంచి 11సీట్లకు అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్
Congress: లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులకు సంబంధించి మొదటి జాబితాపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేసింది. ఈ లిస్ట్‌లో 10రాష్ట్రాల నుంచి దాదాపు 60 సీట్లకు అభ్యర్థుల పేర్లను ప్రకటించనుంది. నిన్న ఢిల్లీలోని అక్బర్ రోడ్‌లో గల ఏఐసీసీ పార్టీ హెడ్ ఆఫీస్ లో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించింది. పార్టీ అగ్రనేత సోనియాగాంధీ, పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ముఖ్యనేతలు జైరాం రమేశ్, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అధిర్ రంజన్ చౌదరి, అంబికా సోని, ముకుల్ వాస్నిక్, టీఎస్ సింగ్ డియో సహా సీఈసీ సభ్యులు పాల్గొన్నారు. వర్చువల్‌గా రాహుల్ గాంధీ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ, కర్నాటక, కేరళ, ఛత్తీస్‌గఢ్, హర్యానా, ఢిల్లీ, ఈశాన్య రాష్ట్రాలతో సహా వివిధ రాష్ట్రాల్లో లోక్ సభ అభ్యర్థుల ఎంపికపై వేర్వేరుగా చర్చించారు. ఇండియా కూటమిలో ఇతర పార్టీలతో పొత్తుల నేపథ్యంలో.. దాదాపు 10 రాష్ట్రాల నుంచి ఫస్ట్ లిస్ట్ లో 60 పైగా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్టు తెలిసింది.
తెలంగాణలోని మొత్తం17 లోక్ సభ నియోజక వర్గాల్లో దాదాపు 9 నుంచి11 స్థానాలకు అభ్యర్థులను సీఈసీ ఖరారు చేసినట్టు సమాచారం. సింగిల్ నేమ్స్, ఎలాంటి పోటీ, వివాదాలకు తావు లేని స్థానాలు ఇందులో ఉంటాయని మీటింగ్‌లో పాల్గొన్న ముఖ్య నేతలు తెలిపారు. తెలంగాణకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఈసీ మెంబర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
పలు దఫాలుగా రాష్ట్ర ముఖ్యనేతలతో భేటీ అయిన రాష్ట్ర ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షి, పీసీసీ చీఫ్ రేవంత్.. అందరి అభిప్రాయాలను క్రోడీకరించి, వడపోసి టాప్ టూ పేర్లతో అశావహుల లిస్ట్‌ను తయారు చేసి హైకమాండ్‌కు సమర్పించినట్టు తెలిసింది. మొత్తం 14స్థానాలకు సంబంధించిన ఆశావహుల వివరాలు ఇందులో ఉన్నట్టు సమాచారం. పలు స్థానాలకు సింగిల్ నేమ్స్ ఉండగా, అసెంబ్లీ ఎన్నికల టైంలో తమ సీట్లను త్యాగం చేసిన వారికి ఎంపీ ఎన్నికల్లో అవకాశం కల్పించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అలాగే, ముఖ్యనేతల కుటుంబ సభ్యులు పోటీ పడుతున్న మరో మూడు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికను పార్టీ అగ్రనాయకత్వానికి వదిలేసినట్టు తెలిసింది. ఈ లిస్ట్ ఆధారంగా ఖర్గే నేతృత్వంలోని సీఈసీ సభ్యులు అభ్యర్థులను ఎంపిక చేశారు.