AOB Bandh: ఏజెన్సీలో హై అలర్ట్
AOB Bandh: గత నెల 16వ తేదీన కొయ్యూరు మండలం తీగలమెట్ట అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పులకు నిరసనగా ఏఓబి బంద్ కు పిలుపునిచ్చారు.
AOB Bandh: గత నెల 16వ తేదీన కొయ్యూరు మండలం తీగలమెట్ట అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పులకు నిరసనగా మావోయిస్టులు గురువారం ఏవోబీ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ ఎన్‌కౌంటర్లో ఆరుగురు మావోయిస్టుల మృతిచెందారు. బంద్‌ను విజయవంతం చేయాలని మావోయిస్టులు మారుమూల గిరిజన గ్రామాల్లో ప్రచారం నిర్వహించినట్టు తెలిసింది. ఈ సమాచారం అందుకున్న పోలీసు వర్గాలు…ఎక్కడా బంద్ ప్రభావం కనిపించ కుండా చేయాలన్న ఉద్దేశంతో చర్యలు చేపట్టారు.
11 మండలాల పోలీస్ స్టేషన్లు అప్రమత్తం చేశారు. సరిహద్దు గ్రామాల్లో గాలింపు చర్యలు నిర్వహిస్తూ, మరోవైపు ప్రధాన కేంద్రాల్లో 24 గంటలూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. వీఐపీలు, ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని మందుపాతరలు అమర్చే అవకాశముందని భావించి, ప్రధాన రహదారులు, వంతెనలు, కల్వర్టుల వద్ద బాంబ్ స్క్వాడ్లు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేస్తున్నారు. మావోయిస్టుల బంద్ పిలుపుతో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాలకు ఆర్టీసీ సర్వీసులను రద్దు చేశారు.