బెంగాల్ లో మార్పు తప్పదా? మమత ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందా..? ఈసారి ఓటర్లు బీజేపీకే పట్టం కట్టబోతున్నారా..? అవుననే అంటున్నాయి ప్రీ పోల్ సర్వేలు. పశ్చిమ బెంగాల్లో నెలకొన్న రాజకీయ పరిస్ధితులపై అధ్యయనం చేసిన పీపుల్స్ పల్స్ అనే సంస్ధ ఓటర్ల మనోభావాలపై ఓ సర్వే కూడా నిర్వహించింది. ఇందులో తృణమూల్ సర్కార్ కి ఈసారి పదవీ గండం ఉందని తేల్చింది. మొత్తం 294 నియోజకవర్గాలున్న బెంగాల్ లో ఈసారి మెజారిటీ స్ధానాలు బీజేపీకు ఎంతో అనుకూలంగా ఉన్నాయని పీపుల్స్ పల్స్ సర్వే పేర్కొంది.
రాష్ట్ర వ్యాప్తంగా 160 స్ధానాల్లో బీజేపీ 70 స్ధానాల్లో తృణమూల్ కాంగ్రెస్ కేవలం 12 నియోజకవర్గాల్లో లెఫ్ట్ కాంగ్రెస్ కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయని పీపుల్స్ పల్స్ సంస్ధ డైరెక్టర్ సజ్జన్ కుమార్ వెల్లడించారు. దాదాపు 39 స్ధానాల్లో బీజేపీ తృణమూల్ మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందని, కేవలం ఐదు స్ధానాల్లో మాత్రమే తృణమూల్-లెఫ్ట పార్టీల మద్య తీవ్రమైన పోటీ ఉంటుదని సర్వేలో తేలింది. పెద్ద ఎత్తున ముస్లిం ఓటు బ్యాంక్ చీలే అవకాశాలు ఉండడం వల్ల కాంగ్రెస్ తృణమూల్ కి తీవ్ర నష్టం జరిగే అవకాశాలు లేకపోలేదని సర్వే పేర్కొంది.
నార్త్ బెంగాల్ సెంట్రల్ బెంగాల్ సౌత్ బెంగాల్ లోని మెజారిటీ నియోజకవర్గాల్లో బీజేపీ సత్తా చూపిస్తుందని పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడైంది. ఎస్సీ, ఎస్టీ ఓటర్లతో పాటు వివిధ సామాజక వర్గాలు మతాల వారీగా అభిప్రాయాలను సేకరించి నివేదిక రూపొందించారు. ప్రభుత్వ వ్యతిరేకతను బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలు ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు. దీంతో బెంగాల్ లో ఈసారి తృణమూల్ విజయం అంత సులభం కాదన్నది అర్ధం అవుతోంది.
2011 ఎన్నికల్లో 184 స్ధానాల్లో జయకేతనం ఎగరేసిన తృణమూల్ కాంగ్రెస్ 2016లో జరిగిన ఎన్నికల్లో 211 నియోజకవర్గాల్లో జయభేరి మోగించింది. సర్వే ఫలితాలను బట్టి చూస్తే ఇప్పుడు పరిస్ధితి పూర్తిగా తిరగబడబోతోంది. ఆ పార్టీ కేవలం 70 స్ధానాల్లో మాత్రమే గెలిచే అవకాశాలు ఉన్నాయని తేలింది. నిన్న మొన్నటి వరకు కేవలం సింగిల్ డిజిట్ కే పరిమితమైన బీజేపీ ఈ ఎన్నికల్లో విశ్వరూపాన్ని ప్రదర్శించబోతోంది. 160 స్ధానాల్లో గెలుస్తుందని పీపుల్స్ పల్స్ సర్వే తేల్చేసింది. మరి ఓటరు నాడి ఎలావుంది....? ఈ సర్వే ఫలితాలు ఎంత వరకు నిజమవుతాయి..? అన్నది తేలాలంటే మే 2 వరకు ఆగాల్సిందే.