Covid Vaccine India: నేటి నుంచి మూడో విడత వ్యాక్సినేషన్
Covid Vaccine India: 18ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్ * ఇప్పటికే 2.45 కోట్ల మంది రిజిస్టర్
Covid Vaccine India: దేశ వ్యాప్తంగా రోజుకు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్న వేళ పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కరోనా వ్యాక్సిన్‌కు తీవ్ర కొరతను ఎదుర్కొంటున్నాయి. దీంతో 18 ఏళ్ల పై బడిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్రం ప్రభుత్వం మూడో విడతలో అందించేందుకు సిద్ధం అయింది. అయితే.. రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు మాత్రం ససేమిరా అంటున్నాయి. మూడో దశ వ్యాక్సినేషన్ చేపట్టలేమని రాష్ట్ర ప్రభుత్వాలు తేల్చేశాయి. రాష్ట్రాల్లో వ్యాక్సిన్ డోసులకు కొరత ఏర్పడటంతో తాము మూడో విడతను ప్రారంభించలేమని ఆ రాష్ట్రాలు ప్రకటించాయి.
ఇప్పటికే దేశంలో 45 ఏళ్ల పైబడ్డవారి కోసం ఆర్భాటంగా చేపట్టిన వ్యాక్సిన్ ప్రక్రియ, కొన్ని రోజులకే ఊపు తగ్గి.. డోసుల కోరతతో నత్తనడకన సాగుతోంది. ఇప్పుడు డోసుల కొరత కారణంగా మూడో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ ఓ ప్రశ్నార్థకంగా మారింది. మూడో విడతలో 18 ఏళ్ల నిండిన వారికి టీకా వేస్తామని ప్రకటించగానే.. కొవిన్ యాప్‌లో నమోదులు వెల్లు వెత్తాయి. ఇప్పటిదాకా 2.45 కోట్ల మంది నమోదు చేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం వీరందరికి శనివారం నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియను మొదలవ్వాలి. డోసులు లేకపోవడంతో తము వ్యాక్సిన్ వేయలేమని జమ్మూ కశ్మీర్ అధికార యంత్రాంగం చేతులెత్తేసింది.
కొత్త వ్యాక్సిన్ డోసులు రాష్ట్రానికి రానందున మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉందని కర్ణాటక ప్రభుత్వం పేర్కొంది. వ్యాక్సిన్ డోసుల పంపిణీలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందని మహారాష్ట్ర ప్రభుత్వం విమర్శించింది. అయితే.. మూడో విడతను పరిమిత డోసులతో ప్రారంభించలేమని వెల్లడించింది. మరోవైపు వ్యాక్సిన్ కోసం ఎవరు రావొద్దంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవార్ సూచించారు.
మొత్తనికి డోసుల కొరతతో రాష్ట్ర ప్రభుత్వాలు అల్లాడిపోతున్నాయి.. దాంతో ఈ సమయంలో ఇవాళ్టీ నుంచి మూడో విడత టీకాల పంపిణీ సరఫరా చేయలేమని కేంద్రానికి రాష్ట్రాలు స్పష్టం చేశాయి. మరో మూడు నుంచి నాలుగు నెలల సమయం పడుతుందని తెల్చి చెప్పాయి. ఈ క్రమంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.