SBI Report: భారత్‌లో కోవిడ్ థర్డ్‌వేవ్‌పై ఎస్‌బీఐ సంచలన నివేదిక

SBI Report: భారత్‌లో కోవిడ్ థర్డ్‌వేవ్‌కు సమయం ఆసన్నమయిందా.?

Update: 2021-07-05 11:10 GMT

SBI Report: భారత్‌లో కోవిడ్ థర్డ్‌వేవ్‌పై ఎస్‌బీఐ సంచలన నివేదిక

SBI Report: భారత్‌లో కోవిడ్ థర్డ్‌వేవ్‌కు సమయం ఆసన్నమయిందా.? డెల్టా ప్లస్, ల్యామ్డా వంటి వేరియంట్లు దేశంలో మూడోదశకు కారణం కాబోతున్నాయా అంటే అవుననే అంటోంది ఎస్‌బీఐ రిసెర్చ్ రిపోర్ట్. 'కోవిడ్-19: ద రేస్ టు ఫినిషింగ్ లైన్' పేరుతో ఎస్‌బీఐ చేపట్టిన రిసెర్చ్ రిపోర్టులో థర్డ్‌వేవ్‌కు సంబంధించిన సంచలన విషయాలు వెల్లడించింది. మరో 30రోజుల్లోనే దేశంలో మూడో దశ రానుందని రిపోర్టులో స్పష్టం చేసింది.

మరోవైపు పాలకులు, ప్రజలు తమ నివేదికపై దృష్టి పెట్టాలని ఎస్‌బీఐ రిసెర్చ్ సూచించింది. 2021 ఆగస్టు నుంచి కోవిడ్ థర్డ్‌వేవ్‌కు అవకాశాలు ఉన్నాయని రిపోర్టులో వెల్లడించింది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో కరోనా ఉద్ధృతి తీవ్ర స్థాయికి చేరుకుంటుందని తెలిపింది. ఈ ఏడాది మే 7న భారత్‌లో సెకండ్ వేవ్ తీవ్ర స్థాయికి చేరుకుందని రిసెర్చ్ రిపోర్ట్ తెలిపింది. ప్రస్తుత డేటా ప్రకారం జులై రెండో వారంలో దేశంలో 10వేల వరకు కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆగస్టు ద్వితీయార్ధంలో కేసుల పెరుగుదల ప్రారంభమవుతుందని తరువాతి నెలలో కరోనా ఉద్ధృతి తీవ్ర స్థాయికి పెరుగుతుందని నివేదికలో స్పష్టం చేసింది.

ఇక వ్యాక్సినేషన్‌పైనా కీలక విషయాలు తమ రిపోర్టులో వెల్లడించింది. భారత్‌లో సగటున రోజుకు 40లక్షల వ్యాక్సిన్ల పంపిణీ జరగుగుతున్నట్లు తెలిపింది. ఇప్పటివరకూ దేశ జనాభాలో 4.6శాతం మంది వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోగా మరో 20.8శాతం ప్రజలకు సింగిల్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు స్పష్టం చేసింది. అయితే, జనాభా శాతంతో పోలిస్తే అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్, స్పెయిన్, ఫ్రాన్స్‌తో సహా ఇతర దేశాల కంటే తక్కువగా ఉన్నట్లు తెలిపింది. మొత్తం డోసుల ప్రకారం ఇతర దేశాల కంటే భారత్ ఎక్కువ వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందించినట్లు ఎస్‌బీఐ రిసెర్చ్ రిపోర్టులో పేర్కొంది.

Tags:    

Similar News