Delhi Water Crisis: దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రతరమవుతున్న నీటి కరువు
ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ఆందోళనలు
Delhi Water Crisis: దేశ రాజధాని ఢిల్లీలో నీటి కొరత తీవ్రరూపం దాల్చింది. నీటి కోసం సామాన్యులు అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. తీవ్రమైన నీటి సంక్షోభంతో కొద్దివారాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఢిల్లీ వాసులు. వాటర్ ట్యాంకుల్లో నీరు సరఫరా చేస్తున్నా అవి సరిపోక నీటికోసం ట్యాంకర్ల దగ్గర యుద్ధం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ఇక రాజధాని నగరంలో నీటి ఎద్దడితో ప్రజలు అల్లాడుతుండగా.. మరోవైపు ఈ అంశం రాజకీయ దుమారం రేపుతోంది. ప్రజలకు నీరందించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ బీజేపీ నిరసనలు చేపడుతుండగా.. ఆప్ హర్యానా ప్రభుత్వంపై నిందలు వేస్తోంది. ఉద్దేశపూర్వకంగానే నీరు ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది. పార్టీల మధ్య రగడ రేగుతున్న వేళ.. మరోపక్క లెఫ్టినెంట్ గవర్నర్ వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి.
ఢిల్లీలో నీటి సమస్యకు హర్యానా నీరు ఇవ్వకపోవడమే కారణమంటూ ఆప్ సర్కార్ ఆరోపిస్తోంది. రోజుకు గాలన్ల కొద్దీ నీటి సరఫరాను నిలిపివేస్తుండటంతో లక్షలాది మంది ప్రజలు నీటి కష్టాలు ఎదుర్కుంటున్నారని ఆప్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిరాహార దీక్షకు దిగిన మంత్రి అతిషి హత్నికుంద్ బ్యారేజ్‌లో నీరున్నా లేవని హర్యానా ప్రభుత్వం అసత్యాలు చెబుతోందని ఆరోపించారు.
మరోవైపు ఆప్ మంత్రి సౌరభ్ భరద్వాజ్ కూడా హర్యానా సర్కార్ తీరును ఎండగట్టారు. అతిషి నీటి కోసం దీక్ష చేపట్టిన మూడు రోజుల్లో దాదాపు 17 మిలియన్ గాలన్ల నీటి సరఫరాను హర్యానా ఆపేసిందని ఆరో్పించారు.
ఇదిలా ఉంటే లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నీటి కొరతకు ఆప్ ప్రభుత్వ తీరే కారణమంటూ హాట్ కామెంట్స్ చేశారు. పక్క రాష్ట్రాలతో సన్నిహితంగా మెలగకుండా ఆప్ నిందలు వేస్తోందని మండిపడ్డారు. రాజకీయంగా మైలేజ్ కోసమే ఆప్ పక్క రాష్ట్రాలపై ఆరోపణలు చేస్తోందని అన్నారు వీకే సక్సేనా. ఇదిలా ఉంటే ఆప్ నేతలు లెఫ్టినెంట్ గవర్నర్‌కు లేఖ రాశారు. లేఖలో నీటి సమస్యను వివరించిన ఆప్ నేత పంకజ్ గుప్తా, సమస్య తీర్చేందుకు గవర్నర్‌తో చర్చిస్తామని తెలిపారు.