Coronavirus: ప్రజల నిర్లక్ష్యంపై కేంద్ర వైద్యారోగ్య శాఖ సీరియస్
Coronavirus: కనీసం జాగ్రత్తలు పాటించకపోవడంతోనే మళ్లీ కేసులు- కేంద్ర వైద్యశాఖ
Coronavirus: దేశంలో కరోనా కేసుల పెరుగుదలకు ప్రజల నిర్లక్ష్యమే కారణమని కేంద్ర ఆరోగ్యశాఖ తెలియజేసింది. కొవిడ్ నియమాలను పాటించకుండా పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. టీకాలు అందుబాటులోకి రావడంతో ప్రజలు మాస్కులు పెట్టుకోనక్కర్లేదని భావిస్తున్నట్లు.. ఆవిధంగా ఆలోచిస్తే ముప్పు తప్పదని హెచ్చరించింది. ప్రజలు ఇప్పటికైనా అనవసర ప్రయాణాలు మానుకోవాలంది కేంద్ర ఆరోగ్య శాఖ.
మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నా ప్రభుత్వం పలు ప్రాంతాల్లో మళ్లీ లాక్‌డౌన్ విధించినా ప్రజలు తీరు మారడం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. అదేవిధంగా పాజిటివ్ కేసులు తగ్గగానే తీర్థ యాత్రలు వెళ్లడం ప్రారంభించారని అయితే యాత్రికుల్లోనూ ఎక్కువ మందికి పాజిటివ్‌గా తేలుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. కుంభమేళా నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఉత్తరాఖండ్ సర్కార్‌కు సూచించింది.
ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 4.4కోట్ల వ్యాక్సిన్ డోసులు వేసినట్లు కేంద్రం తెలియజేసింది. మార్చి 20 నాటికి 23.35 కోట్ల టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. మరోవైపు.. దేశవ్యాప్తంగా రోజుకు 40వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదువుతున్నాయి. ప్రస్తుతం భారత్‌లో యాక్టివ్ కేసులు 3లక్షలకుపైగానే ఉన్నాయి. ఇక రికవరీ రేటు 95.96కు పడిపోయింది. ఇక మహారాష్ట్ర, పంజాబ్‌తోపాటు కేరళలో వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.