శ్రీలంక జాతీయులపై తమిళనాడు సర్కారు మల్లగుల్లాలు

* ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేవంటున్న అధికారులు.. తిరుచ్చిలో శ్రీలంక శరణార్థుల శిబిరానికి తరలింపు

Update: 2022-11-13 07:28 GMT

శ్రీలంక జాతీయులపై తమిళనాడు సర్కారు మల్లగుల్లాలు

Rajiv Gandhi Assassination Case: రాజీవ్‌గాంధీ హత్య కేసులో దోషుల విడుదల కోసం తీవ్రంగా ప్రయత్నించిన తమిళనాడు ప్రభుత్వం వారిలో శ్రీలంక జాతీయులైన నలుగురిని ఏం చేయాలన్నదానిపై మల్లగుల్లాలు పడుతోంది. శ్రీలంక జాతీయులుగా ధ్రువీకరించే పత్రాలు కూడా లేకపోవడంతో వారి విషయంలో స్టాలిన్‌ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందనేది చర్చనీయాంశమైంది. మూడు దశాబ్దాలకు పైగా జైలు శిక్ష అనుభవించిన నళిని, శ్రీహరన్‌, రవిచంద్రన్‌, శాంతను, రాబర్ట్‌ ఫయాజ్‌, జయకుమార్‌లను విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో నళిని, రవిచంద్రన్‌ పెరోల్‌పై బయట ఉండగా మురుగన్‌, రాబర్ట్‌ ఫయాజ్‌, శాంతను, జయకుమార్‌ విడుదలయ్యారు. మురుగన్‌, శాంతను, రాబర్ట్‌ ఫయాజ్‌, జయకుమార్‌ శ్రీలంకకు చెందిన వారు. ఆ విషయాన్ని వారే స్వయంగా విచారణ సమయంలో అంగీకరించారు.

ఎల్టీటీఈ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ పొట్టు అమ్మన్‌ అండతో 1991 జనవరిలో శ్రీలంక నుంచి సముద్ర మార్గం ద్వారా కొడియాక్కరై ప్రాంతానికి రాగా, ఎల్టీటీఈ యుద్ధ వ్యూహ నిపుణుడు శివరాసన్‌ దేశంలోకి స్వాగతించాడని మురుగన్‌ విచారణలో తెలిపాడు. సుదేంద్రరాజా అలియాస్‌ శాంత కూడా శ్రీలంక నుంచి వచ్చినట్లు తెలిపాడు. శ్రీలంకలోని జాఫ్నా దీవికి చెందిన రాబర్ట్ ఫయాజ్ 1990 సెప్టెంబరు 20వ తేదీన సముద్రమార్గం ద్వారా రామేశ్వరంలో దిగాడు. అనంతరం చెన్నైకి తరలివచ్చి అద్దె ఇంట్లో ఉండేవాడు. జైలు నుంచి విడుదల కాగానే వారిని శ్రీలంక పంపించాల్సి ఉంది. కానీ అందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు గానీ, పాస్‌పోర్టులు, వీసాలు లేకపోవడంతో తిరుచ్చిలోని శ్రీలంక శరణార్థుల శిబిరానికి వారిని ప్రభుత్వం తరలించింది.

భారతదేశ పౌరసత్వ చట్టం-1955 సెక్షన్‌ ప్రకారం విదేశీయులెవరైనా మన దేశం వారిని వివాహం చేసుకుంటే వారికి భారత పౌరసత్వం వర్తిస్తుంది. ఆ ప్రకారం చూస్తే నళినిని వివాహం చేసుకున్న మురుగన్‌కు మన పౌరసత్వం వస్తుంది. కానీ, అక్రమంగా దేశంలోకి చొరబడిన వారికి ఈ చట్టం వర్తించదు. మూడు దశాబ్దాల క్రితం శ్రీలంకను వీడి భారత్‌లోకి అక్రమంగా చొరబడిన ఈ నలుగురిని తమ వారిగా ఆ దేశం అంగీకరించకపోవచ్చు. ఎల్టీటీఈని బద్ధ శత్రువుగా చూస్తున్న శ్రీలంక ప్రభుత్వం వీరిని తమ పౌరులుగా ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదు. అందుకే శ్రీలంక శరణార్థులను ఉంచే ప్రత్యేక శిబిరాలకు ఈ నలుగురినీ తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

నిన్న విడుదలైన మురుగన్‌ను పోలీసులు తిరుచ్చికి తరలిస్తుండగా, నళిని కన్నీటి పర్యంతమైంది. గతంలో వేలూరు జైల్లో ఉండగా, ప్రతి 15 రోజులకోసారి వారిద్దరూ కలుసుకునేవారు. మురుగన్‌ను శరణార్థి శిబిరానికి తరలిస్తుండడంతో ఆయన్ని ఇప్పట్లో కలుసుకోవడం కష్టమన్న ఆందోళనతో ఆమె కన్నీటి పర్యంతమైనట్టు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News