Adani-Hindenburg Case : అదానీ కేసుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
Adani Group: విచారణ జరిపి 2023 నవంబర్ 24న తీర్పును రిజర్వ్ చేసిన సీజేఐ ధర్మాసనం
Adani Group: దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన అదానీ హిండెన్‌బర్గ్ రిపోర్టు అంశం కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. అదానీ షేర్ల కేసులో ప్రత్యేక దర్యాప్తు అవసరం ఏమీ లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. స్టాక్ మార్కెట్‌లో షేర్ల విలువ పెంచుకునేందుకు అదానీ కంపెనీ.. అవకతవకలకు పాల్పడిందంటూ గత ఏడాది హిండెన్‌బర్గ్ సంస్థ తన రిపోర్టును బయటపెట్టింది. అయితే స్టాక్ మార్కెట్లో అవకతవకలపై విచారణ జరిపించాలంటూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
విచారణ జరిపిన ధర్మాసనం గతేడాది నవంబర్ 24న తీర్పును రిజర్వ్ చేసింది. అదానీ షేర్ల వ్యవహారంలో దర్యాప్తు చేయాలని సెబీని ఆదేశించింది సుప్రీంకోర్టు. ఇదే సందర్భంలో సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ చర్యలను సమర్థించింది. దర్యాప్తులో భాగంగా నిపుణుల కమిటీపై వచ్చిన ఆరోపణలు సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. సెబీ రెగ్యులేషన్ల పరధిలోకి తాము వెళ్లదలచుకోలేదని స్పష్టం చేసింది. హిండెన్‌బర్గ్ కేసును ప్రత్యేక దర్యాప్తునకు పంపాల్సిన అవసరం ఏం లేదని తేల్చిచెప్పింది. 3 నెలల్లో దర్యాప్తు పూర్తిచేయాలని సెబీని ఆదేశించింది సుప్రీంకోర్టు. ప్రభుత్వం, సెబీలు.. పెట్టుబడిదారులకు రక్షణ కల్పించాలని ఆదేశించింది.