Supreme Court: సుప్రీంకోర్టు కొలీజియం మరో చారిత్రాత్మక నిర్ణయం
Supreme Court: ఒకేసారి 12 హైకోర్టులకు 68 మంది జడ్జిల పేర్లు సిఫారసు * బార్ అసోసియేషన్ నుంచి 44 మంది
Supreme Court: సుప్రీంకోర్టు కొలిజీయం మరోసారి చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 12 హైకోర్టులకు 68 మంది న్యాయమూర్తుల నియామకానికి సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలిజీయం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 25, సెప్టెంబర్ 1న జరిగిన కొలిజీయం సమావేశంలో 68 మంది పేర్లను ఖరారు చేశారు. నిజానికి నూట పన్నెండు పేర్లను కొలిజీయం పరిశీలించింది. వీరిలో 82 మంది బార్ అసోసియేషన్ నుంచి, 31 మంది జ్యుడిషియల్ సర్వీసెస్ నుంచి అభ్యర్థులు ఉన్నారు. అయితే చివరికి నూట పన్నెండు మందిలో 68 మంది పేర్లను మాత్రమే కొలీజియం ఖరారు చేసింది.
ఈ 68 మందిలో 44 మంది బార్ అసోసియేషన్, 24 మంది జ్యుడిషయల్ సర్వీసెస్‌కు చెందిన వారు ఉన్నారు.ఇందులో మరో చారిత్రాత్మక నిర్ణయం కూడా ఉంది. మిజోరాంకు చెందిన ఆదీవాసీ మహిళా జ్యుడిషయల్ అధికారి మార్లీ వన్‌కుంగ్‌ను గౌహతీ హైకోర్టు జడ్జీగా నియమిస్తూ కొలీజియం సిఫారసు చేసింది. 75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో మిజోరాం నుంచి ఒక మహిళ.. అదీ ఆదీవాసీ మహిళ జడ్జి కావడం ఇదే ప్రథమం. కొలిజీయం సిఫార్సు చేసిన 68 మంది న్యాయమూర్తులలో 10 మంది మహిళలు ఉన్నారు.
ఇదిలా ఉండగా.. మరో 16 మంది అభ్యర్థులకు సంబంధించి అదనంగా మరిన్ని వివరాలు కొలీజియం కోరినట్టు తెలుస్తోంది. బహుశా ఆ వివరాలు అందిన తరువాత.. వాళ్ల పేర్లను కూడా న్యాయమూర్తుల పదవులకు కొలిజీయం పరిశీలించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. కాగా.. కొలిజీయం సిఫార్సు చేసిన 68 న్యాయమూర్తులు అలహాబాద్, రాజస్థాన్, కలకత్తా, జార్ఖండ్, జమ్మూ కశ్మీర్, మద్రాసు, మధ్యప్రదేశ్, కర్నాటక, పంజాబ్, హర్యానా, కేరళ, ఛత్తీస్‌గడ్, అస్సాం హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులు కానున్నారు.
ఆగస్టు 17న తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు జడ్జీలను కొలిజీయం సిఫార్సు చేసింది. ఆ తరువాత అదే రోజు 9 మందిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా సిఫార్సు చేసింది. ఆ తరువాత సీజేఐ ఎన్వీ రమణ. సుప్రీంకోర్టు అనుబంధ భవనంలో ఉన్న ఆడిటోరియంలో 9 మంది చేత ప్రమాణ స్వీకారం చేయించారు. వీరితో కలిపి సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరింది. ఇక.. ఒకే ఒక స్థానం ఖాళీగా ఉంది. ఇప్పుడు మళ్లీ భారీస్థాయిలో 12 హైకోర్టులకు 68 మంది న్యాయమూర్తుల నియామకానికి సిఫారసు చేస్తూ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.