Post Office: పోస్టాఫీసులోని ఈ పథకంపై అత్యధిక వడ్డీ చెల్లిస్తున్నారు..

* సుకన్య సమృద్ధి యోజన (SSY) పోస్టాఫీసు చిన్న పొదుపు పథకాలలో చేర్చారు.

Update: 2021-11-29 02:39 GMT

పోస్టాఫీసులోని ఈ పథకంపై అత్యధిక వడ్డీ చెల్లిస్తున్నారు(ఫైల్ ఫోటో)

Post Office: మీరు కష్టపడి సంపాదించిన సొమ్మును ఎక్కడ పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే పోస్టాఫీసు మీకు చాలా బెటర్‌. ఎందుకంటే మీ సొమ్ముకి భద్రత ఉంటుంది అదే సమయంలో మంచి రాబడిని కూడా అందిస్తుంది.

బ్యాంకులలో చేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కంటే ఇందులోని కొన్ని స్కీములలో అత్యధిక వడ్డీ చెల్లిస్తున్నారు. అంతేకాదు చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అనుకూలమైన స్కీమ్‌లు ఇందులో ఉన్నాయి. అయితే పోస్టాఫీసు పథకాలలో ఎక్కువ వడ్డీ ఇచ్చే స్కీమ్‌ గురించి తెలుసుకుందాం. ఇది మీ పిల్లల భవిష్యత్‌ని నిర్ణయిస్తుంది.

సుకన్య సమృద్ధి యోజన (SSY) పోస్టాఫీసు చిన్న పొదుపు పథకాలలో చేర్చారు. ఇది పోస్టాఫీసు పథకాలన్నింటిలో అత్యధిక వడ్డీని చెల్లించే స్కీమ్ అని చెప్పవచ్చు. ఈ పథకంలో ఏటా 7.6 శాతం వడ్డీ రేటు అందుబాటులో ఉంది. ఈ వడ్డీ రేటు ఏప్రిల్ 1 నుంచి వర్తిస్తుంది.

వడ్డీ వార్షిక ప్రాతిపదికన లెక్కిస్తారు. సుకన్య సమృద్ధి యోజనలో ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.250 గరిష్టంగా రూ.1.5 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. ఒక నెల లేదా ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్ల సంఖ్యపై పరిమితి లేదు.

ఈ పథకం కింద తల్లిదండ్రులు10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలిక పేరు ఖాతాను ఓపెన్‌ చేయవచ్చు. భారతదేశంలోని ఒక పోస్టాఫీసులో లేదా ఏదైనా బ్యాంకులో ఆడపిల్ల పేరు మీద ఒక ఖాతా మాత్రమే ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది.

కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు ఆడపిల్లల కోసం ఈ ఖాతాను ఓపెన్‌ చేయవచ్చు. కవలలు లేదా విషయంలో రెండు కంటే ఎక్కువ ఖాతాలను ఓపెన్ చేసే అవకాశం కల్పిస్తారు. ఖాతా తెరిచిన తేదీ నుంచి 21 సంవత్సరాల వ్యవధి తర్వాత మూసివేసే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఆడపిల్లకి 18 ఏళ్లు నిండిన తర్వాత వివాహ సమయంలో ఖాతా మూసివేస్తారు.

ఖాతా తెరిచిన తేదీ నుంచి 15 సంవత్సరాలు పూర్తయ్యే వరకు ఈ పథకంలో డిపాజిట్లు చేయాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో ఖాతాలో కనీస మొత్తం రూ.250 జమ చేయకపోతే ఆ ఖాతా డిఫాల్ట్ ఖాతాగా పరిగణిస్తారు.

ఖాతా తెరిచిన తేదీ నుంచి15 సంవత్సరాలు పూర్తికాకముందే డిఫాల్ట్ అయిన ఖాతాను కూడా సరిచేయవచ్చు. దీని కోసం వ్యక్తి డిఫాల్ట్‌గా ప్రతి సంవత్సరం రూ.50తో కనీసం రూ. 250 డిపాజిట్ చేయాలి. ఖాతాలో జమ చేసిన మొత్తంపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద మినహాయింపు పొందవచ్చు.

Tags:    

Similar News