Lok Sabha Elections 2024: దేశ వ్యాప్తంగా రెండో విడత ఎన్నికల పోలింగ్
Lok Sabha Elections 2024: 13 రాష్ట్రాల్లో 88 లోక్‌సభ స్థానాలకు ఓటింగ్
Lok Sabha Elections 2024: దేశ వ్యాప్తంగా రెండో దశ ఎన్నికలు కొనసాగుతున్నాయి. 543 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు విడుదల అవుతాయి. ఇప్పటికే ఏప్రిల్ 19న దేశవ్యాప్తంగా 102 ఎంపీ స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. ఇవాళ రెండో విడతలో 13 రాష్ట్రాల్లోని 88 లోక్‌సభ పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయి. 16 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 88 లోక్‌సభ స్థానాల పరిధిలో 1లక్షా 67వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బిహార్‌లోని 4 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ సమయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పెంచింది. ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు.
ఇక రెండో విడత పోలింగ్‌లో కేరళలోని మొత్తం 20 స్థానాలకు, కర్ణాటకలోని మొత్తం 28 స్థానాల్లో 14 స్థానాలకు, రాజస్థాన్‌లో 13, మహారాష్ట్ర 8, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో ఐదు స్థానాల చొప్పున, అస్సాం, బిహార్, చత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్‌లో ఒక్కో రాష్ట్రంలో 3 స్థానాలకు, మణిపూర్, త్రిపుర, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో ఒక్కో సీటుకి పోలింగ్ కొనసాగుతుంది.
బెంగళూర్ సౌత్ నుంచి బీజేపీ తరుపున తేజస్వీ సూర్య, కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యారెడ్డితో తలపడుతున్నారు. ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ బీజేపీ కంచుకోట రాజ్‌నంద్ గావ్ నుంచి బరిలోకి దిగారు. బీజేపీ నేత సంతోష్ పాండేతో బఘేల్ పోటీ పడుతున్నారు. రామయాణ్ టీవీ సీరియన్ ఫేమ్ శ్రీరాముడి పాత్రని పోషించింది అరుణ్ గోవిల్ మీరట్ నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ కీలక నేత కేసీ వేణుగోపాల్ కేరళ అలప్పుజ సీటు నుంచి పోటీ చేస్తున్నారు. త్రిస్సూర్ నుంచి బీజేపీ నేత, మళయాళ నటుడు సురేష్ గోపి పోటీలో ఉన్నారు.