వానాకాలం వెళ్లిపోయినా..వదలని వర్షాలు..ఎందుకలా?

Update: 2020-10-20 06:15 GMT

వాయుగుండం వదిలినా తెలుగురాష్ట్రాలను వానలు వదలటం లేదు. వారం రోజులుగా వాయుగుండాలు, అల్పపీడనాలు విపత్తులను, చేదు అనుభవాలను మిగిల్చాయి. తెలంగాణలో గత 33 ఏళ్లలో ఎన్నడూ లేని వర్షాలు కురిశాయి. వర్షాలు, వరదలతో హైదరాబాద్‌ సహా పలు జిల్లాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. వారం రోజులైనా వీడని వరదలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.

అయితే దీనంతటికీ నైరుతి రుతుపవనాల తిరోగమనానికి బ్రేక్ పడటమే కారణమంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు. అక్టోబర్‌ అయినా వర్షాలు వదలకపోవటంతో అంతర్జాతీయ వాతావరణ పరిస్థితులను విశ్లేషించారు శాస్త్రవేత్తలు వానలకు గల కారణాలను వెల్లడించారు. లాక్‌డౌన్‌తో కాలుష్యం తగ్గడం- దీనివల్ల గాలిలో స్వచ్ఛత ఏర్పడి తేమ పెరగడం కూడా అధిక వర్షాలకు కారణమని చెబుతున్నారు. దీనికితోడు ఫసిఫిక్‌ మహా సముద్రంలో ఏటా ఉండే ఎల్‌నినో ప్రభావం భారత్‌పై ఈ ఏడాది పడలేదని గుర్తించారు.

సాధారణంగా జరగాల్సిన రుతుపవనాల తిరోగమన ప్రక్రియ ఈ ఏడాది ఆలస్యంగా జరిగింది. గత 11 ఏళ్ల కాలంలో 2018లో మాత్రమే రుతుపవనాలు ఆలస్యంగా సెప్టెంబరు 29న తిరోగమనం ప్రారంభించగా ఈ ఏడాది సెప్టెంబర్‌ 28న వెనక్కి వెళ్లడం మొదలైంది. అయితే ఈ రుతుపవనాలకు మధ్యప్రదేశ్‌‌లోనే బ్రేక్ పడింది. బంగాళాఖాతం నుంచి వస్తున్న తేమగాలులు, అల్పపీడనాల గాలులు వాటి నిష్క్రమణను నిలిపేశాయి.

గత వారంలో అల్పపీడనంతో తీవ్రగాలులు, వర్షాలు కురిశాయి. మళ్లీ మంగళవారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయి. దీంతో మరో నాలుగైదు రోజుల వరకూ రుతుపవనాలు వెనక్కి కదలవని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అవి పూర్తిగా వెనక్కి వెళ్లిపోతేనే వర్షాలు తగ్గిపోతాయని, లేకపోతే ఎక్కడో ఓ చోట కురుస్తూనే ఉంటాయని తెలిపారు. 2010, 2016లో అక్టోబరు 28 వరకు తెలంగాణలో రుతుపవనాల నిష్క్రమణ పూర్తికాలేదు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు.

ఉత్తర-దక్షిణ, తూర్పు-పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలుల ప్రవాహ ద్రోణులు ఏర్పడటం వల్ల తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు తప్పేలా లేవు. ఈ ప్రవాహ ద్రోణులు ఉపరితల ఆవర్తనాన్ని తాకి ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయి. దీని ప్రభావంతో మంగళ, బుధవారాల్లో తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.

ఏటా సాధారణంగా ఈశాన్య భారతం, హిమాలయాలున్న రాష్ట్రాల్లో అధిక వర్షాలు పడతాయి. ఈసారి అందుకు భిన్నంగా ఈశాన్య భారతం కంటే ఇతర ప్రాంతాల్లో అధికంగా వర్షాలు పడ్డాయి. ఈ ఏడాది జూన్‌ నుంచి సెప్టెంబరు మధ్య మహారాష్ట్ర కచ్‌ సబ్‌డివిజన్‌లో సాధారణం కన్నా 126 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత రాయలసీమలో 84, ఉత్తర కర్ణాటకలో 49, తెలంగాణలో 46 శాతం అదనపు వర్షపాతం కురిసింది.

Tags:    

Similar News