72వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశరాజధాని ఢిల్లీలోని రాజ్‌పథ్ మార్గం సిద్ధమైంది. మరికొద్ది సేపట్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రిపబ్లిక్ డే పరేడ్‌ను ప్రారంభించనున్నారు. ప్రతి ఏడాది అట్టహాసంగా విదేశీ ముఖ్యఅతిథి సమక్షంలో జరిగే వేడుకలు కరోనా కారణంగా విదేశీ అతిథి లేకుండా జరుగనున్నాయి. దాదాపు 1 లక్ష 25 వేల మంది వీక్షించే అవకాశం ఉన్నా ఈసారి కరోనా నిబంధనల కారణంగా 25 వేలకు తగ్గించారు. 25 వేల మందిలో అధికారులు ఇతర కేంద్ర, ఢిల్లీ రాష్ట్ర సిబ్బంది మినహాయిస్తే, కేవలం 4,500 మంది సాధారణ ప్రజానీకానికే అనుమతి ఇచ్చారు. గణతంత్ర దినోత్సవ కవాతులో పాల్గొనే గ్రూపుల సంఖ్య 144 నుండి 96కు తగ్గించారు. గణతంత్ర దినోత్సవ కవాతు జరిగే మార్గాన్ని ఎర్రకోట వరకు కాకుండా ఇండియా గేట్ వెనుక ఉండే నేషనల్ స్టేడియం వరకు తగ్గించారు. ఈ సారి కవాతులో బంగ్లాదేశ్ ఆర్మీ బృందం కవాతు చేయనుంది.