పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభలో స్పీకర్ ఓం బిర్లా ప్రారంభోపన్యాసం చేశారు. లోక్ సభ సమావేశాలు ఆరంభం కాగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సభ సంతాపం తెలిపింది. దేశానికి ప్రణబ్ సేవలను సభ కొనియాడింది. ఏ పదవిలో ఉన్నా ప్రణబ్ ముఖర్జీ ఆ పదవికి వన్నె తెచ్చారని స్పీకర్ ఓం బిర్లా ప్రశంసించారు. అలాగే ఇటీవల మృతి చెందిన తమిళనాడు ఎంపీ వసంత్‌కుమార్, పండిత్ జస్రాజ్, అజిత్ జోగి తదితరులకు సభ సంతాపం తెలిపింది. కరోనా ప్రభావం తర్వాత మొదటసారిగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండటంతో ప్రభుత్వం అనేక జాగ్రత్తలు తీసుకున్నది. కరోనా నేపథ్యంలో పార్లమెంట్ సిబ్బందితోపాటు, సభ్యులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. నెగెటివ్ వచ్చినవారికే సభలోకి అనుమతి ఇస్తున్నారు.
మొదటిసారిగా లోక్‌సభ, రాజ్యసభ వేర్వేరు సమయాల్లో కోలువుదీరుతున్నాయి. ఈరోజు ఉదయం 9 గంటలకు లోక్‌సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం నుంచి రాజ్యసభ సమావేశం కానుంది. అయితే రేపటి నుంచి 9 గంటలకు రాజ్యసభ, మధ్యాహ్నం నుంచి లోక్‌సభ సమావేశాలు జరుతాయి.