Cyclone Jawad: ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం.. జవాద్‌ తుపానుగా మారే ఛాన్స్

* రేపు ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా వద్ద తీరం తాకే అవకాశం * ఇవాళ, రేపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

Update: 2021-12-03 05:00 GMT

తుపాను ప్రభావంతో ఈరోజు, రేపు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలను వాతావరణ శాఖ హెచ్చరించింది(ఫైల్-ఫోటో)

Jawad Cyclone: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది విశాఖ దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమైంది. మరికొన్ని గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశిస్తూ జవాద్ తుపానుగా మారనుంది. రేపు ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా వద్ద తీరం తాకే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. తుపాను ప్రభావంతో ఇవాళ, రేపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. యానంలోనూ భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది.ఇవాళ సాయంత్రం నుంచి తీరంలో గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలపై జవాద్‌ ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రేపు ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్ ప్రకటించారు అధికారులు. ఈదురుగాలుల వేగం కొన్నిచోట్ల 100 కిలోమీటర్లకు పైగానే ఉండొచ్చని తెలిపారు. ఈ మూడు జిల్లాల్లో రెండ్రోజుల పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. మత్స్యకారులు రెండు రోజులపాటు వేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

జవాద్‌ తుపాను ఎఫెక్ట్‌తో శ్రీకాకుళం జిల్లాలోని 12 మండలాలకు ముప్పుందని అధికారులు తెలిపారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తీర ప్రాంతంలో 70కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, సిక్కోలు మత్య్సకారులు వేటకు వెళ్లొద్దని తెలిపారు. ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో జిల్లాలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు సెలవులు ప్రకటించారు కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్.

Tags:    

Similar News