వాషింగ్టన్‌లో ఎమర్జెన్సీ: కీలక నిర్ణయం తీసుకున్న డొనాల్డ్ ట్రంప్
* అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో ఎమర్జెన్సీ * జనవరి 11 నుంచి 24 వరకు ఎమర్జెన్సీ * జనవరి 20న జో బైడెన్ ప్రమాణస్వీకారం నేపథ్యంలో నిర్ణయం
అగ్రరాజ్యం అమెరికాలో వరుస దాడులకు కుట్ర జరుగుతోందా? వాషింగ్టన్ కేపిటల్ భవనంపై బుధవారం జరిగిన దాడులు ఎలాంటి సంకేతాలను ఇస్తున్నాయి? 50 రాష్ట్రాల రాజధానులే లక్ష్యంగా కుట్రలు జరుగుతున్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానం నిజమనే చెబుతోంది అగ్రరాజ్యం ప్రధాన ఇన్వెస్టిగేషన్ సంస్థ ఎఫ్‌బీఐ. దీంతో అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో ఎమర్జెన్సీ విధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు డొనాల్డ్ ట్రంప్.
మరికొన్ని రోజుల్లో అధ్యక్షపీఠం దిగబోతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశ రాజధాని వాషింగ్టన్‌లో ఎమర్జెన్సీ విధించారు. జనవరి 20న జో బైడెన్ ప్రమాణస్వీకారం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా రెండు వారాల పాటు ఎమర్జెన్సీ విధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. బుధవారం వాషింగ్టన్ కేపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు దాడికి పాల్పడ్డ ఘటనలో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కావడంతో పాటు నలుగురు మరణించారు. ఈ ఘటన నేపథ్యంలో బైడెన్ ప్రమాణ స్వీకారం సమయంలో ఉద్రిక్తతలు చోటుచేసుకునే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్తగా చర్యగా ట్రంప్ వాషింగ్టన్‌లో అత్యవసర పరిస్థితిని విధించారని వైట్‌హౌస్ వెల్లడించింది. జనవరి 11 నుంచి 24 వరకు ఎమర్జెన్సీ ఉంటుందని ప్రకటించింది.
మరోవైపు రాజధాని వాషింగ్టన్‌తో పాటు దేశంలోని 50 రాష్ట్రాల రాజధానుల్లోని కేపిటళ్లపై దాడికి కుట్రలు జరుగుతున్నట్లు ఎఫ్‌బీఐ హెచ్చరించింది. బైడెన్ ప్రమాణ స్వీకారానికి సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఘర్షణలు జరిగే ప్రమాదం ఉందని ఎఫ్‌బీఐ హెచ్చరించడంతో భద్రతను కట్టుదిట్టం చేసే దిశగా రాజధానిలో ఎమర్జెన్సీ విధించారు. 59వ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని జనవరి 11 నుంచి 24 వరకు అత్యవసర పరిస్థితిని విధించారు డొనాల్డ్ ట్రంప్.