Lok Sabha Elections 2024: ఈ నెల 19న తొలి దశ లోక్‌సభ పోలింగ్
Lok Sabha Elections 2024: 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు పోలింగ్
Lok Sabha Elections 2024: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో భారత్‌లో ఈ నెల 19న ఓట్ల పండుగ ప్రారంభం కానుంది. సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. తొలి దశలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని మొత్తం 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. తమిళనాడులోని మొత్తం 39 స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరుగుతాయి. తొలి విడతలో పోటీ చేస్తున్న కీలక నేతల్లో 8 మంది కేంద్రమంత్రులు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, ఒక మాజీ గవర్నర్ ఉన్నారు.
కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ నాగపూర్ బరిలో ఉన్నారు. కిరణ్ రిజిజు అరుణాచల్ వెస్ట్ నుంచి, సర్వానంద సోనోవాల్ దిబ్రూగఢ్ నుంచి పోటీ చేస్తున్నారు. జితేంద్ర సింగ్ ఉదంపూర్ నుంచి, భూపేంద్ర యాదవ్ రాజస్థాన్‌లోని అల్వార్ లోక్‌సభ స్థానంలో పోటీ చేస్తున్నారు. అర్జున్ రామ్ మేఘ్వాల్ బికనీర్ బరిలో, మురుగన్ నీలగిరి బరిలో నిలిచారు. ఇక కాంగ్రెస్ అగ్రనేత చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం శివగంగా నుంచి, తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై కోయంబత్తూరు నుంచి, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై చెన్నై సౌత్ నుంచి పోటీ చేస్తున్నారు. డీఎంకే అగ్ర నాయకురాలు కనిమొళి తూత్తుకుడి నుంచి, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ తనయుడు నకుల్‌నాథ్ చింద్వారా నుంచి బరిలో నిలిచారు.
ఈ నెల 19న జరిగే తొలిదశ ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. తొలివిడతలో జరిగే 102 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్, డీఎంకే తదితర పార్టీల అగ్రనేతలు పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు.