New Reservations: అగ్రవర్ణ పేదలకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్
* మెడికల్ సీట్లలో ఓబీసీలకు 27, ఈడబ్ల్యూఎస్‌కు 10శాతం రిజర్వేషన్ * లబ్ధి పొందనున్న 5,550 మంది విద్యార్థులు
OBC Reservation in India: అగ్రవర్ణ పేదలకు గుడ్‌న్యూస్ తెలిపింది కేంద్ర ప్రభుత్వం. అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్, డెంటల్ కోర్సుల్లో ఆలిండియా కోటా పథకంలో ఓబీసీలకు 27 శాతం, ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే కొత్త రిజర్వేషన్లు అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది.
ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఏటా ఎంబీబీఎస్‌లో 15 వందల మంది ఓబీసీ, పోస్టు గ్రాడ్యుయేషన్‌లో 2 వేల 500 మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. ఈడబ్ల్యూఎస్‌కు రిజర్వేషన్లు ప్రకటించడంతో ఎంబీబీఎస్‌లో 550 మంది పోస్టు గ్రాడ్యుయేషన్‌లో వెయ్యి మంది విద్యార్థులు లబ్ధి పొందుతారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో ఇతర రిజర్వ్‌డ్ సీట్లు తగ్గవని స్పష్టం చేసింది కేంద్ర వైద్యారోగ్య శాఖ. ఆరేళ్లలో దేశంలో ఎంబీబీఎస్ సీట్లు 54 వేల నుంచి 84 వేలకు పీజీ సీట్లు 30 వేల నుంచి 54 వేలకు పెరిగినట్లు తెలిపింది.
ఇక తాజా రిజర్వేషన్లను ఆలిండియా కోటాలో అమలు చేస్తున్నందున ఈ పథకంతో దేశవ్యాప్తంగా ఓబీసీ విద్యార్థులంతా ప్రయోజనం పొందవచ్చని కేంద్రం తెలిపింది. దీంతో విద్యార్థులు కేవలం సొంత రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లోని మెడికల్, డెంటల్ సీట్ల కోసం పోటీ పడే అవకాశం లభిస్తుంది. ఓబీసీల జాబితా కూడా కేంద్ర జాబితా ఆధారంగానే ఖరారు చేస్తారు.
ప్రభుత్వం తీసుకున్న కీలకమైన ఈ నిర్ణయం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. మెడికల్, డెంటల్ కోర్సుల్లో ఓబీసీలు, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు రిజర్వేషన్ కల్పించడం వల్ల ఏటా వేలాది మంది యువత ప్రయోజనం పొందుతారని వారికి మరిన్ని గొప్ప అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ప్రధాని ట్వీట్ చేశారు. దేశంలో సామాజిక న్యాయానికి ఇదొక నూతన ఉదాహరణ అన్నారు.