India China Border: సరిహద్దుల్లో మళ్లీ హైటెన్షన్

* చైనా సరిహద్దుల్లో యుద్ధ విన్యాసాలు * సైనిక సన్నద్ధతను ముమ్మరం చేసిన భారత్‌ * లేహ్ పర్వత ప్రాంతాలలో యుద్ధ విన్యాసాలు

Update: 2021-08-10 03:57 GMT

సరిహద్దుల్లో హైటెన్షన్ (ఫైల్ ఫోటో)

India China Border: సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. వాస్తవాధీన రేఖ వెంబడి సైనిక సన్నద్ధతను భారత్ ముమ్మరం చేసింది. చైనా నుంచి ఎదురయ్యే ఎలాంటి ముప్పునైనా సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా లేహ్ పర్వత ప్రాంతాలలో యుద్ధ విన్యాసాలు నిర్వహించింది.

తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ దగ్గర భారత్‌, చైనా మధ్య ఘర్షణలకు ఏడాది దాటింది. గల్వాన్‌ లోయలో ఘర్షణల తర్వాత ఉద్రికత్త పరిస్థితుల్ని చల్లార్చేందుకు కొంతకాలంగా ఇరు దేశాల సైనికాధికారులు 12 విడుతలుగా చర్చలు జరిపారు. ఫలితంగా ప్యాంగ్యాంగ్‌ సరస్సు, గోగ్రా హైట్స్‌ వంటి ప్రాంతాల నుంచి బలగాలు ఉపసంహరించారు.మిగతా ప్రాంతాల నుంచి మాత్రం బలగాల ఉపసంహరణ దిశగా చైనా అడుగులు వేయడం లేదు.దీంతో వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు దేశాలు భారీ సంఖ్యలో బలగాలను కొనసాగిస్తున్నాయి.

డ్రాగన్ కుతంత్రాలతో భారత్ అప్రమత్తమైంది. ఎలాంటి ముప్పునైనా తిప్పికొట్టేలా యుద్ధ ట్యాంకులు, ఐసీవీల ద్వారా పర్వత ప్రాంతాల్లో వ్యూహాలు రచిస్తుంది. 14వేల నుంచి 17వేల అడుగుల ఎత్తులో యుద్ధ ట్యాంకులు, హెలికాప్టర్లలో విన్యాసాలు నిర్వహించింది. గల్వాన్‌ వివాదం అనంతరం భారత సైన్యం టీ-90 భీష్మ, టీ-72 అజయ్‌ ట్యాంకులతోపాటు బీఎంపీ సిరీస్‌ పదాదిదళ పోరాట వాహనాలను ఎడారులు, మైదానాల నుంచి పర్వత ప్రాంతాలకు తరలించింది.

మైనస్‌ 45 డిగ్రీల అతి శీతల ఉష్ణోగ్రతలో పర్వత ప్రాంతాల దగ్గర వాటిని మరింత సమర్థంగా వినియోగించుకునేందుకు సైన్యం యుద్ధ విన్యాసాలు నిర్వహించింది. అపాచీ, చినూక్‌, సీ-130, సూపర్‌ హెర్కులెస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ హెలికాప్టర్లు, ఎంఐ-17 హెలికాప్టర్లు, లైట్‌ మెషీన్‌ గన్‌లతోపాటు మరికొన్ని ఆయుధాలతో సైనికులు పాల్గొన్నారు. రష్యాకు చెందిన ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థను సైతం విన్యాసాల్లో ఉపయోగించారు. రెజిమెంట్‌ దళాలు చేపట్టిన యుద్ధ విన్యాసాలు, అటాకింగ్‌ ఆపరేషన్లు చైనా సరిహద్దుకు కేవలం 40 కిలోమీటర్ల దూరంలోనే జరుగుతున్నాయి.

Tags:    

Similar News