Delhi Farmers: ఢిల్లీలో రైతుల ఆందోళనలో ఉద్రిక్తత
* ఘాజీపూర్ దగ్గర రణరంగంగా మారిన పరిస్థితి * రైతులు రహదార్లను ఖాళీ చేయాలని యూపీ ప్రభుత్వం ఆదేశాలు * చట్టాల రద్దయ్యే వరకు వెనక్కి తగ్గేదే లేదంటున్న రైతులు
కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో గత రెండు నెలలుగా రైతులు చేస్తున్న ఉద్యమం ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఘాజీపూర్ దగ్గర పరిస్థితి రణరంగంగా మారింది. రైతులు రహదార్లను ఖాళీ చేయాలని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు. అయితే మూడు చట్టాలను రద్దు చేసేవరకు ఘాజీపూర్ రహదారిని ఖాళీ చేయమని రైతులు తేల్చిచెప్పారు. ఎప్పటికీ రైతులు కదలకపోవడంతో బలవంతంగా ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు పోలీసులు. దీంతో రైతులు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది.
శాంతియుతంగా దీక్షలు చేస్తున్న తమను బలవంతంగా ఖాళీచేయిస్తే మూకుమ్మడిగా ఉరివేసుకుంటామని రైతులు బెదిరించారు. పోలీసుల గన్‌లకు అయినా ఎదురెళ్తాం కానీ భయపడి వెనకడుగు మాత్రం వేయమని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. ఫలితంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఎలాగైనా రైతులను ఖాళీ చేయించాలని కేంద్రం డిసైడ్ అయ్యింది. అందుకోసం ఉత్తరప్రదేశ్, హర్యానా సరిహద్దుల్లోని సింఘు, టిక్రీ, ఘాజీపూర్ వద్ద భారీగా పోలీసు, పారా మిలిటరీ బలగాలను మోహరించారు అధికారులు.
జనవరి 26న రైతు సంఘాలు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీలో హింస చోటుచేసుకోవటాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటనపై వివిధ పోలీస్ స్టేషన్లలో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన పోలీసులు.. రైతు సంఘాల నేతలపై అత్యంత తీవ్రమైన యూఏపీఏ, దేశద్రోహం కేసులు పెట్టారు. పలువురు రైతు నేతలపై లుకౌట్ నోటీసులు జారీచేశారు. అయితే ఈ చర్యలపై భయపడేది లేదని రైతు నేతలు అంటున్నారు. ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
మరోవైపు విధ్వంస ఘటనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న సింగర్ దీపూ సిద్ధూ అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ రావడంతో అతడిపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. చివరి లోకేషన్ హర్యానాలో ఉన్నట్టు గుర్తించగా అక్కడి నుంచి ఎక్కడకు వెళ్లాడనేది ప్రశ్నగా మిగిలిపోయింది.