Bengal Elections: పశ్చిమబెంగాల్ నాలుగో దశ ఎన్నికల్లో ఉద్రిక్తత
Bengal Elections: కూచ్ బీహార్‌లో బీజేపీ కార్యకర్త కాల్చివేత * ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తున్న బీజేపీ, టీఎంసీ
Bengal Elections: పశ్చిమ బెంగాల్ ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తత నడుమ జరుగుతున్నాయి. విడత విడత ఏదో ఒక చోట ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. హింస, గొడవలతో ఈసీ ఎన్నికలు నిర్వహిస్తోంది. ఇప్పటికే జరిగిన మూడు విడతల్లో తీవ్ర ఘర్షణలు జరిగాయి. బెంగాల్ లో మరోమారు అధికారం కోసం టీఎంసీ, అధికారం బీజేపీ పోటిపడుతున్నాయి. బెంగాల్ దంగల్‌లో గతంలో ఎప్పుడూ లేని విధంగా తీవ్ర ఉద్రిక్తతల నడుమ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇన్నాళ్లు ఘర్షణలతోనే జరిగిన ఎన్నికలు నాలుగో విడతలో నాటుబాంబులు కలకలం రేపాయి.
ఇవాళ జరుగుతున్న నాలుగో విడత ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కూచ్‌బెహర్ జిల్లాలో టీఎంసీ, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. సుప్రియో బరిలో ఉన్న టోలిగంజ్‌లోని గాంధీకాలనీ పోలింగ్ కేంద్రంలోకి బీజేపీ ఏజెంట్‌ను అనుమతించలేదు. సుప్రియో స్వయంగా పోలింగ్ కేంద్రానికి చేరుకుని తమ ఏజెంట్ ధ్రువీకరణ పత్రాలు అధికారులకు చూపించారు. దీంతో ఎన్నికల అధికారులు బీజేపీ ఏజెంట్‌ను లోపలికి అనుమతించారు. ఇదే అంశం తీవ్ర ఉద్రిక్తతలు దారి తీసింది. శీతల్‌కూచి నియోజకవర్గ పరిధిలో టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఇరు వర్గాలు పరస్పరం దాడులకు దిగారు.. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను తరిమికొట్టేందుకు లాఠీ చార్జీ చేశారు.
కూచ్‌బెహర్ జిల్లా దిన్‌హటాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ బూత్ లోకి టీఎంసీ ఏజెంట్లు వెళ్లకుండా బీజేపీ రచ్చ చేస్తుందని తృణమూల్ ఆరోపించింది. కాదు కాదు టీఎంసీయే బూత్‌లు ఆక్రమిస్తుందంటూ బీజేపీ ఆరోపించింది. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇరువర్గాలు నాటుబాంబులతో దాడి చేసుకున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టే సమయంలో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. బుల్లెట్ తగిలి బీజేపీ కార్యకర్త మృతి చెందాడు. బీజేపీ పై ఎన్నికల సంఘానికి తృణమూల్ ఫిర్యాదు చేసింది.
టీఎంసీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆడియో, వీడియో చాట్ కలకలం రేపింది. మోడీకి ప్రజాదరణ ఉందంటూ ప్రశాంత్ కిషోర్ ఆడియో లీక్‌తో టీఎంసీ ఇరుకున పడిందని బీజేపీ ఆరోపించింది. దీనిపై బీజేపీ ఐటీ చీఫ్ అమిత్ మాల్వియా స్పందించారు. బెంగాల్‌లో అధికార పక్షం టీఎంసీకి వ్యతిరేకత ఉందని ప్రశాంత్ కిషోర్ గుర్తించాని ఆయన ట్వీట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.