Delhi: ఢిల్లీని వణికిస్తున్న చలి.. 3 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత
Delhi: పొగమంచుకు రోడ్లు కనిపించక వాహనాదారుల ఇబ్బందులు
Delhi: ఢిల్లీని పొగమంచు గజగజ వణికిస్తోంది. ఈ సీజన్‌లోనే ఇవాళ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. 3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవడంతో ఢిల్లీవాసులు చలికి గడ్డకట్టుకుపోయారు. ఢిల్లీతో సహా ఉత్తర భారతంలో దట్టమైన పొగమంచు కురుస్తోంది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఉదయం 5 గంటల 30 నిమిషాలకు కూడా పొగ మంచు కురుస్తూనే ఉంది. చలి పంజాకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఢిల్లీలో టెంపరేచర్లు భారీగా పడిపోవడంతో చలి గాలులు వీస్తున్నాయి.
సఫ్దర్ గంజ్‌లో మంగళవారం కనిష్ట ఉష్ణోగ్రత 8.5 డిగ్రీలు నమోదు కాగా, బుధవారం ఉదయం 4.4 డిగ్రీలకు పడిపోయింది. ఈ సీజన్ లో ఇదే అతి తక్కువ టెంపరేచర్ అని వాతావరణ శాఖ తెలిపింది. కొండప్రాంతాలైన డెహ్రాడూన్‌లో 4.5 డిగ్రీలు, ధర్మశాలలో 5.2, నైనిటాల్‌లో 6 డిగ్రీలకంటే తక్కువ టెంపరేచర్ ఢిల్లీలో నమోదైందని వెల్లడించింది. రానున్న రెండ్రోజుల పాటు ఢిల్లీ, ఉత్తర భారతంలో చలిగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. NCR పరిధిలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీకి వచ్చే రైళ్లు ఆలస్యంగా నడిచాయి. 19 రైళ్లు ఆలస్యంగా వచ్చాయి.