Sirisha Bandla: నేడు అంతరిక్షంలో అడుగుపెట్టనున్న శిరీష బండ్ల
Sirisha Bandla: రోదసిలోకి మన తెలుగు అమ్మాయి శిరీష బండ్ల తొలిసారి ప్రవేశించబోతున్నారు.
Sirisha Bandla: మన భారతీయురాలు.. మన తెలుగమ్మాయి.. మన ఆంధ్రా వనిత.. మన గుంటూరు బిడ్డ.. అంతరిక్షంలోకి రయ్ రయ్ మని దూసుకుపోతోంది. రోదసీలోకి అడుగుపెట్టే తెలుగమ్మాయిగా చరిత్ర సృష్టించబోతుంది. గుంటూరు జిల్లాకు చెందిన బండ్ల శిరీష్ ఈ ఘనత సాధించనున్నది. ఉంటుంది అమెరికా అయినా.. మూలాలు గుంటూరు జిల్లా. అందుకే ఇప్పుడు తెలుగోళ్లు గర్వంగా తలెత్తి ఆకాశం వైపు చూస్తున్నారు.
ప్రముఖ అంతరిక్ష సంస్థ వర్జిన్ గెలాక్టిక్ ఆదివారం మానవ సహిత వ్యోమనౌక వీఎస్‌ఎస్ యూనిటీ-22ను వీఎంఎస్ ఈవ్ అనే ప్రత్యేక విమానం భూమి నుంచి 15వేల మీటర్ల ఎత్తుకు తీసుకెళ్లనుంది. అక్కడి నుంచి రాకెట్ ప్రజ్వలనంతో యూనిటీ-22 మరింత ఎత్తుకు వెళుతుంది. చివరి దశలో సొంత ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఈ వ్యోమనౌకలో వర్జిన్ గెలాక్టిక్ సంస్థ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్‌తో పాటు మరో అయిదుగురు ప్రయాణించనుండగా వారిలో శిరీష కూడా ఉన్నారు.
నాలుగో వ్యోమగామిగా ఉన్న శిరీష వ్యోమనౌకలో మానవ తీరుతెన్నులకు సంబంధించి ఫ్లోరిడా విశ్వవిద్యాలయం రూపొందించిన ప్రయోగాన్ని నిర్వహిస్తారు. ఈ యాత్ర విజయవంతమైతే భారత్ నుంచి అంతరిక్షానికి వెళ్లిన నాలుగో వ్యోమగామిగా శిరీష చరిత్ర పుటలకు ఎక్కనున్నారు. ఇంతకుముందు రాకేశ్ శర్మ, కల్పనా చావ్లా, భారత-అమెరికన్ సునీతా విలియమ్స్ రోదసిలోకి వెళ్లి వచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో జన్మించిన బండ్ల శిరీష తల్లిదండ్రులతో పాటు అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో స్థిరపడ్డారు. పర్‌డ్యూ విశ్వవిద్యాలయం నుంచి ఏరోనాటికల్-ఆస్ట్రోనాటికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొంది.. అనంతరం జార్జ్ వాషింగ్టన్ వర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తిచేశారు. ప్రస్తుతం ఆమె వర్జిన్ గెలాక్టిక్‌లో ప్రభుత్వ వ్యవహారాలు, పరిశోధన కార్యకలాపాల విభాగానికి ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. ''అంతరిక్షయానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న కంపెనీలో, యూనిటీ-22 సిబ్బందిలో భాగస్వామి కావడాన్ని అత్యంత అదృష్టంగా భావిస్తున్నాను'' అని శిరీష ట్వీట్ చేశారు.