Tamil Nadu: ఇవాళ తమిళనాడు సీఎం స్టాలిన్‌తో భేటీ కానున్న కేసీఆర్
*తమిళనాడు పర్యటనలో తెలంగాణ సీఎం కేసీఆర్ *శ్రీరంగం సందర్శించిన సీఎం కేసీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు
CM KCR: చెన్నై పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ తమిళనాడు సీఎం స్టాలిన్ తో సమావేశం కానున్నారు. తిరుత్తణిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఇద్దరు సీఎంలు సమావేశం కానున్నారు. కుటుంబ సమేతంగా తమిళనాడు చేరుకున్న సీఎం కేసీఆర్ నిన్న తిరుచిరాపల్లి జిల్లా శ్రీరంగంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం రంగనాథ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ పండితులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం కుటుంబ సభ్యులను ఆలయ వేదపండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అంద చేశారు. శ్రీరంగం ఆలయ దర్శనానికి రావడం ఇది రెండోసారని..రంగనాథస్వామిని దర్శించుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు సీఎం కేసీఆర్. తమిళనాడు సీఎం స్టాలిన్ తనుకు మంచి మిత్రుడని.. ఆయన సీఎం అయిన తర్వాత మంగళవారం చెన్నైలో తొలిసారిగా కలుస్తున్నట్లు తెలిపారు.
రాత్రి చెన్నైలోనే బస చేసిన సీఎం కేసీఆర్ ఇవాళ సాయంత్రం ఆళ్వార్‌పేట చిత్తరంజన్‌రోడ్‌లోని సీఎం స్టాలిన్ నివాసం చేరుకోనున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ వైఖరి, బియ్యం కొనుగోళ్ల విధానం చర్చించనున్నారు. అదే విధంగా కేంద్ర, రాష్ట్ర సంబంధాలు ఇతర విషయాలతో పాటు బీజేపీ వ్యతిరేక కూటమిలపైన ఇద్దరు సీఎంలు చర్చించే అవకాశాలున్నాయి.