Chaiwala Sends Rs.100 to PM Modi: గడ్డం తీసేయండి మోడీజీ.. చాయ్‌వాలా
Chaiwala Sends Rs.100 to Modi: మోడీ పెంచాల్సింది గడ్డం కాదు, ఉపాధి, టీకాలు పెంచండి అంటూ ఓ చాయ్ వాలా రూ.100లు మనియార్డర్ చేశాడు
Chaiwala Sends Rs.100 to Modi: బెంగాల్ ఎన్నికలకు ముందు నుంచి గడ్డం పెంచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. రవీంద్ర నాథ్ ఠాగూర్ అవతారంలో కనిపించారు. బెంగాల్ ఎన్నికల్లో ఇమేజ్ బిల్డప్ కోసమేనని సోషల్ మీడియాలో తెగ కామెంట్లు వచ్చాయి. కాని బెంగాల్ ఎన్నికలు అయిపోయాక కూడా ఆయన అదే గెటప్ లో కొనసాగుతున్నారు. ఎన్నికల్లో ఓడిపోయినందుకేనని నెటిజన్లు మళ్లీ కామెంట్లు పెట్టారు. కాని మోదీ మాత్రం తనదైన శైలిలో.. అదే గెటప్ ను కొనసాగిస్తున్నారు. ఇప్పుడో చాయ్ వాలా 100 రూపాయలు పంపించి.. మోదీజీ గడ్డం గీసుకోండిజీ అంటూ మోదీ వైఫల్యాలను ఎత్తి చూపుతూ లేఖ పంపాడు. ఇది ఇప్పుడు హైలెట్ అవుతోంది.
మోదీ గడ్డంను చూసిన మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి.. షేవ్ చేసుకోండంటూ రూ.100 మనియార్డర్ చేశాడు. మహారాష్ట్ర పూణే సమీపంలోని బారామతికి చెందిన చాయ్‌వాలా అనిల్ మోరే మోదీజీ గడ్డం తీసుకోవాలంటూ రూ.100 మనియార్డర్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీంతోపాటు ఆయన ఓ లేఖను సైతం రాశాడు. మోదీజీ.. పెంచాల్సింది గడ్డం కాదు.. ఉపాధి పెంచండి, టీకాలు పెంచండి, కోవిడ్‌తో మరణించిన కుటుంబాలకు పరిహారం పెంచండి.. అంటూ పలు విజ్ఞప్తులు చేశాడు అనిల్ మోరే.
అనిల్ మోరే బారామతి ఇంద్రాపూర్ రోడ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి వద్ద టీ స్టాల్ నడుపుతున్నాడు. ఈ క్రమంలో ఆయన మోదీకి లేఖ రాశాడు. దేశం మొత్తం కరోనా మహమ్మారితో పోరాడుతోంది. దేశంలో ప్రజలు చనిపోతున్నారు. ఎందరివో ఉద్యోగాలు పోతున్నాయి. కానీ ప్రధాని మోదీ మాత్రం తన గడ్డాన్ని పెంచుకుంటున్నారు. ఆయన ఇంకా ఏమైనా పెంచాలనుకుంటే.. ప్రజలకు ఉపాధి పెంచాలి, టీకాలను పెంచాలి. వైద్య సౌకర్యాలు పెంచాలి.. నా సంపాదన నుంచి రూ.100 మోదీజీకి పంపుతున్నాను. ఈ మొత్తాన్ని గడ్డం తీయడానికి వాడితే సంతోషిస్తాను.
కోవిడ్‌తో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు, లాక్ డౌన్ తో దెబ్బతిన్న కుటుంబాలకు రూ.30000 ఆర్థిక సహాయం చేయాలని మోరే ప్రధానికి రాసిన లేఖలో కోరారు. పేదవారి కష్టాలను చూసిన తాను ఈ విధంగా ప్రధానికి తెలియజేయాలనుకుంటున్నానని మోరే తెలిపాడు. మోదీజీ గొప్ప నాయకుడు. ఆయన్ను గౌరవిస్తాను.. ఆయనంటే అభిమానం కూడా.. ఆయనను బాధించాలని ఇలా చేయడం లేదు. కరోనా కారణంగా పెరుగుతున్న సమస్యలపై దృష్టి సారించి ఉపాధి పెంచితే దేశం బాగుపడుతుందనుకుంటున్నా అంటూ అనిల్ మోరే విజ్ఞప్తి చేశారు.