Tauktae Cyclone: బుసలు కొడుతున్న తౌక్టే తుఫాన్

Tauktae Cyclone: కేరళలో ఇప్పటికే దచ్చికొట్టిన వాన * తెలంగాణలోనూ తౌక్టే తుఫాన్ ప్రభావం

Update: 2021-05-16 06:58 GMT
Tauktae Cyclone (file Image)

Tauktae Cyclone: తౌక్టే తుఫాన్ ముంచుకొస్తోంది. ఎల్లుండి తుఫాన్‌ గుజరాత్‌ వద్ద తీరాన్ని దాటే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫాన్ భయంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే కేరళను అకాల వర్షాలు అతలాకుతలం చేశాయి. తౌక్టే ప్రభావం తెలంగాణలో కూడా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు పడవచ్చని హెచ్చరిస్తోంది. ప్రధానంగా రాష్ట్ర దక్షిణ, మధ్య ప్రాంతంలోని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.

కరోనాతో వణికిపోతున్న పలు రాష్ర్టాలపై ప్రకృతి కూడా పగబట్టింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన 'తౌక్టే' తుఫాన్‌ బుసలుకొడుతుంది. అర్ధరాత్రి తీవ్ర తుఫాన్‌ గా మారి గుజరాత్‌ తీరం వైపు కదులుతోంది. ఎల్లుండి మధ్యాహ్నం పోర్‌బందర్‌, నలియా మధ్య తీరం దాటవచ్చని ఐఎండీ వెల్లడించింది. దీంతో గుజరాత్‌ ప్రజలు గజగజ వణుకుతున్నారు. రైతులు ఆందోళన చెందుతున్నారు. గుజరాత్‌లోని 15 జిల్లాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలు సిద్ధంగా ఉన్నాయి.

ఇప్పటికే కేరళలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. పలుచోట్ల చెట్లు, విద్యుత్తు స్తంభాలు కూలిపోయాయి. వేర్వేరుచోట్ల ఇద్దరు ప్రాణాలు వదిలారు. తౌక్టే తుఫాన్‌ ముప్పుతో కేరళలోని 9 జిల్లాల్లో రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించారు. తుఫాన్‌ ముప్పు రాష్ర్టాల్లో ముందుజాగ్రత్త చర్యలపై ఢిల్లీలో ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. తౌక్టే ప్రభావంతో ఐదు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో నష్టం భారీగా ఉంటుందని కేంద్ర హోం శాఖ హెచ్చరించింది. గోవాతో పాటు మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌, రత్నగిరి జిల్లాలపై తుఫాన్‌ ప్రభావం భారీస్థాయిలో ఉంటుందని ఐఎండీ హెచ్చరిస్తోంది.

తౌక్టే తుఫాన్‌ తెలంగాణపైనా కూడా ప్రభావం చూపే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం చెబుతోంది. విదర్భ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం శనివారం బలహీనపడింది. వీటి ప్రభావం వల్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు వీయనున్నాయి. ప్రధానంగా దక్షిణ, మధ్య ప్రాంతంలోని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే చాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో నిన్న సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ రేపు కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కాస్త తగ్గే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

Tags:    

Similar News